TELANGANA

సింగరేణికి ‘బంగారు’ అవకాశం.. కర్ణాటకలో పసిడి గనుల అన్వేషణకు లైసెన్స్..

సింగరేణి సంస్థ కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించింది. బంగారం, రాగి గనుల అన్వేషణకు లైసెన్స్ దక్కించుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని దేవదుర్గ్‌లో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో 37.75 శాతం రాయల్టీని కోట్ చేయడం ద్వారా సింగరేణి ఎల్-1 బిడ్డర్‌గా నిలిచిందని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ తెలిపారు.

 

సింగరేణిని ఇతర రంగాల్లోకి విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా చేస్తున్న ప్రయత్నంలో తొలి విజయం సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ గనుల్లో అన్వేషణ పూర్తి చేస్తామని తెలిపారు.

 

దేవదుర్గ్‌లోని బంగారం, రాగి నిక్షేపాలు ఉన్న ప్రాంతంలో సింగరేణి అన్వేషణ విభాగం ఆధ్వర్యంలో త్వరలో పరిశోధన చేయనుంది. వివిధ రకాల అన్వేషణల అనంతరం తుది ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించవలసి ఉంటుంది. ఆ గనులను సింగరేణి లేదా ఇతర సంస్థలు దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది.

 

ఈ గనులను మైనింగ్ కోసం దక్కించుకున్న సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీలో 37.75 శాతాన్ని ఆ గని జీవితకాలం పాటు సింగరేణికి చెల్లించవలసి ఉంటుంది. బంగారం, రాగి గనుల అన్వేషణ కోసం రూ. 90 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు ఉండగా, రూ. 20 కోట్లు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుంది.