TELANGANA

జూబ్లీహిల్స్ ను ప్రధాని మోదీకి బహుమతిగా ఇద్దాం: రాంచందర్ రావు..

కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఓట్లు చోరీ చేస్తున్నారని, మజ్లిస్ పార్టీ మద్దతుతో రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంఐఎం కూడా ఇదే తరహాలో ఓట్లను దొంగిలించి గెలుస్తోందని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

 

ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పార్టీని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఆ పార్టీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి కుటుంబంలోనే ఆస్తుల కోసం కలహాలు ముదురుతున్నాయని ఎద్దేవా చేశారు. మరోవైపు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ పథకాలకు తమ స్టిక్కర్లు వేసుకుని ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.

 

హైదరాబాద్‌ను బీజేపీకి కంచుకోటగా మార్చామని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు గెలవడమే దీనికి నిదర్శనమని రాంచందర్ రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీకి మంచి ఓటింగ్ శాతం వచ్చిందని, ప్రజలు బీజేపీనే ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిని గెలిపించి, ఆ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి కానుకగా అందించాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

 

హైదరాబాద్ నగరంలోని సమస్యలపై రాంచందర్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “నగరంలో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. మ్యాన్‌హోల్స్ తెరిచే ఉన్నాయి. వర్షాకాలం ప్రమాదాల గురించి ముందుగానే హెచ్చరించినా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించడం లేదు. వారి తీరు చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లుంది. ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది” అని ఆయన మండిపడ్డారు.