ఏళ్ల తరబడి గుడిసెల్లోనే గడిపిన గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల ఏజెన్సీ గ్రామమైన బెండాలపాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి వేదిక కానుంది . ఈ పథకం కింద నిర్మించిన ఇళ్ల గృహప్రవేశ మహోత్సవం బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనుంది.
సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:20 గంటలకు హెలికాప్టర్లో బెండాలపాడుకు చేరుకుంటారు. గ్రామంలోని లబ్ధిదారులైన బచ్చల నర్సమ్మ, బచ్చల రమణ ఇళ్లలో జరిగే గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన స్వయంగా పాల్గొంటారు. అనంతరం ఇతర లబ్ధిదారులతో ముచ్చటించి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత దామరచర్లలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
పైలట్ ప్రాజెక్ట్‌గా బెండాలపాడు
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి బెండాలపాడు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసింది. చండ్రుగొండ మండలానికి మొత్తం 968 ఇళ్లు మంజూరు కాగా, ఒక్క బెండాలపాడు గ్రామానికే 310 ఇళ్లను కేటాయించారు. వీటిలో ఇప్పటికే 58 ఇళ్ల స్లాబులు పూర్తి కాగా, 86 ఇళ్లు పైకప్పు దశలో, మరో 150 ఇళ్లు పునాది స్థాయిలో ఉన్నాయి. రాష్ట్రంలోనే అతి తక్కువ సమయంలో అత్యధిక ఇళ్లను పూర్తి చేసిన గ్రామంగా బెండాలపాడు నిలిచింది.
ఇది చారిత్రక ఘట్టం: మంత్రి పొంగులేటి
సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం పర్యవేక్షించిన రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారుమూల గిరిజన గ్రామానికి రావడం ఒక చారిత్రక ఘట్టం. ఇది గ్రామ ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని అన్నారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి నిధుల విడుదల వరకు పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తున్నామని, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మహబూబ్‌నగర్‌లోనూ సీఎం పర్యటన
ఈ పర్యటనకు ముందు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మూసాపేట మండలంలోని కార్నింగ్ టెక్నాలజీస్ కంపెనీ యూనిట్‌ను ప్రారంభించి, పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమవుతారు. ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి బయలుదేరి, అక్కడి కార్యక్రమం ముగించుకుని భద్రాద్రి పర్యటనకు వెళ్లనున్నారు.

