బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ వంటి నేతలు బయటకు వెళ్లిపోవడానికి మాజీ మంత్రి హరీశ్ రావు కారణమంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కవిత ఆరోపణల్లో వాస్తవం లేదని, తాను బీఆర్ఎస్‌ను వీడటానికి కేసీఆర్, కేటీఆరే కారణమని ఆయన స్పష్టం చేశారు. హరీశ్ రావు వల్ల తాను పార్టీని వీడలేదని తేల్చి చెప్పారు.
“కేసీఆర్, కేటీఆర్ అహంకారం, వారి అవినీతి భరించలేకే నేను బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాను. కవిత ఇప్పుడు అమాయకురాలిలా మాట్లాడుతున్నారు. ఆమె అవినీతికి పాల్పడలేదా?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఒకే కుటుంబం రాష్ట్రాన్ని పాలించిందని, దాని ఫలితంగానే పార్టీ నుంచి నేతలు వెళ్లిపోవాల్సి వచ్చిందని అన్నారు.
ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మొత్తం కేసీఆర్‌దేనని ఆరోపించారు. ఆ ప్రాజెక్టు విషయంలో హరీశ్ రావు పాత్ర కేవలం సంతకాలు పెట్టడానికే పరిమితమైందని కొండా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, కవితను బీజేపీ వైపు కూడా చూడనివ్వబోమని ఆయన తేల్చిచెప్పారు.