TELANGANA

బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. బీజేపీలో చేరిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలకు నేతల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా, బీఆర్ఎస్ పార్టీ మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు.

 

మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీలు సీతారాం నాయక్‌, గోడం నగేశ్‌, హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో వీరు నలుగురు బీజేపీలో చేరారు.

 

 

బీజేపీ కండువాలను కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ నాయకులు లక్ష్మణ్‌, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. కాగా, ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరిన విషయంతెలిసిందే. దీంతో లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 

తెలంగాణలో బీజేపీకి 12 సీట్లు ఖాయం: డీకే అరుణ

 

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్ లో 33 శాతం రిజర్వేషన్‌తో మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం రాబోతుందన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన మహిళా మోర్చా కార్యవర్గ సమావేశానికి డీకే అరుణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలే లక్ష్యంగా పనిచేయాలన్నారు. రామరాజ్య స్థాపనలో ముందడుగు వేసిన ప్రధాని మోడీకి మహిళలంతా అండగా నిలవాలని డీకే అరుణ పిలుపునిచ్చారు