మాజీ మంత్రి హరీశ్‌రావుపై కవిత చేసిన తీవ్ర ఆరోపణలు సృష్టించిన రాజకీయ ప్రకంపనల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. విదేశీ పర్యటనను ముగించుకుని ఈ ఉదయం నగరానికి చేరుకున్న హరీశ్‌రావు మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీ కోసం ఆయన నేరుగా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు బయలుదేరి వెళ్లారు.
కవిత ఇటీవల హరీశ్‌రావుతో పాటు ఎంపీ సంతోష్‌రావుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో టచ్‌లో ఉన్నారని, కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చి పార్టీని తమ చేతుల్లోకి తీసుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో లండన్ పర్యటనలో ఉన్న హరీశ్‌రావు తిరిగి రాగానే ఈ అంశంపై కేసీఆర్‌తో చర్చించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తనపై వచ్చిన ఆరోపణల విషయంలో కేసీఆర్‌కు పూర్తి వివరణ ఇచ్చే అవకాశం ఉంది.
అయితే, ఈ వివాదంలో బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా హరీశ్‌రావుకు మద్దతుగా నిలవడం గమనార్హం. పార్టీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా హరీశ్‌రావుకు బాసటగా పోస్టులు పెట్టడంతో ఈ వ్యవహారంలో కేసీఆర్ మద్దతు ఆయనకే ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల మధ్య కేసీఆర్, హరీశ్ రావు భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది