TELANGANA

మంత్రులకు శాఖల ఖరారు – నేడే తొలి మంత్రివర్గ భేటీ..!!

తెలంగాణ కొత్త మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ శాఖల ఎంపిక పైన నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 11 మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ సీఎం హోదాలో భట్టి బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇక..మిగిలిన 10 మందికి శాఖల కేటాయింపు పైన స్పష్టత వచ్చింది. అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. ఇక, తెలంగాణ తొలి కేబినెట్ సమావేశం ఈ సాయంత్రం జరగనుంది.

 

శాఖలు కేటాయింపు : తెలంగాణలో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయింపు పూర్తయింది. డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్క్ రెవిన్యూ శాఖను పర్యవేక్షించనున్నారు. ధరణి పోర్టల్ వ్యవహారం ఎన్నికల సమయంలో వివాదంగా మారింది. ప్రభుత్వంలో కీలకమైన రెవిన్యూ శాఖను భట్టికి కేటాయించారు. ఇక..సీఎం పదవి కోసం చివరి వరకు రేసులో నిలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం శాఖ ఖరారు చేసారు. మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ నిర్వహించిన శాఖలను కేటాయిస్తూ నిర్ణయించారు. మున్సిపల్ తో పాటుగా ఐటీ శాఖను కేటాయించారు. వైఎస్ హయాంలోనూ కోమటిరెడ్డి ఐటీ శాఖను పర్యవేక్షించారు. దామోదర రాజనర్సింహకు వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. సీనియర్ నేత కావటంతో కీలకమైన ఈ శాఖను అప్పగించారు.

 

Port folios allotted for Telangana new ministers, Revnue for deputy CM Bhatti Vikramarka

సీనియర్లకు కీలక శాఖలు : సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావుకు రోడ్లు, భవనాల శాఖ ఖరారైంది. తుమ్మల సుదీర్ఘ కాలం టీడీపీ – బీఆర్ఎస్ లో పలు శాఖలను నిర్వహించిన అనుభవం ఉంది. గతంలోనూ ఈ శాఖ నిర్వహించారు. ఇక, ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటికి ఇరిగేషన్ శాఖ ను ఖరారు చేసారు. తెలంగాణ ప్రస్తుత ఆర్దిక పరిస్థితుల వేళ ఆర్దిక శాఖ ఎవరికి ఇస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే, మేనిఫెస్టో రూపకల్పనలో కీలకంగా పని చేసిన శ్రీధర్ బాబుకు ఆర్దిక శాఖతో పాటుగా అసెంబ్లీ వ్యవహారాలను ఖరారు చేస్తూ నిర్ణయించారు. జూపల్లికి గతంలో నిర్వహించిన పౌర సరఫరాలను తిరిగి కేటాయించారు. తొలి సారి మంత్రి అయిన సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ ఖరారు అయింది. పొన్నం ప్రభాకర్ కు బీసీ సంక్షేమశాఖ..కొండా సురేఖకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఖరారైంది. ఈ శాఖల కేటాయింపు పైన అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది.

 

తొలి మంత్రివర్గ సమావేశం : ఇక, తెలంగాణ కొత్త ప్రభుత్వంలో ఇంటిజెన్స్ చీఫ్ గా సీనియర్ ఐపీఎస్ శివధర్ రెడ్డిని నియమిస్తూ సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. ఇక..ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ కార్యదర్శిగా శేషాద్రిని నియమించారు. ఆయన భూ పరిపాలనా, సాధారణ పరిపాలనా వ్యవహారాల్లో ఎక్కువ కాలం పని చేసారు. ఈ సాయంత్రం తెలంగాణ నూతన ప్రభుత్వ మంత్రివర్గ తొలి భేటీ జరగనుంది. ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీల అమలుకు వీలుగా కేబినెట్ ఆమోద ముద్ర వేయనుందని సమాచారం. అదే సమయంలో సీనియర్లు మంత్రులుగా కొనసాగుతున్న సమయంలో రేవంత్ వారితో తన అభిప్రాయాలను.. లక్ష్యాలను షేర్ చేసుకొనే అవకాశం కనిపిస్తోంది. తొలి కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.