TELANGANA

తెలంగాణ గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు .

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షపై సంచలన తీర్పు వెల్లడించింది హైకోర్టు. అభ్యర్థుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం, గ్రూప్-1 మెయిన్స్ మెరిట్ లిస్ట్‌ను రద్దు చేసింది. మెయిన్స్ పేపర్లు రీ వాల్యూయేషన్ చేయాలని ఆదేశించింది. లేని పక్షంలో మెయిన్స్ పరీక్షను మరోసారి నిర్వహించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది కోర్టు.

 

తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్ మూల్యాంకనం, ర్యాంకింగ్‌ లిస్ట్‌పై మంగళవారం హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా వెల్లడించిన జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌, మార్కుల జాబితాను న్యాయస్థానం రద్దు చేసింది.

 

సంజయ్‌ వర్సెస్‌ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఫాలో కావాలని ఆదేశించింది. దాని ప్రకారం పునఃమూల్యాంకనం జరపాలని, ఈ ప్రక్రియను 8 నెలల్లోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.

 

గ్రూప్‌-1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు, ఎంపిక పూర్తి కావడంతో పరీక్షను రద్దు చేయరాదంటూ అభ్యర్థులు న్యాయస్థానంలో వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేశారు. ఏప్రిల్‌లో జరిగిన విచారణ సందర్బంగా గ్రూప్‌-1 నియామకాలపై స్టే విధించింది హైకోర్టు.

 

నియామకాలపై ఉన్న స్టేను తొలగించాలని ఇంప్లీడ్‌ పిటీషన్ దాఖలు చేశారు గ్రూప్‌-1కు ఎంపికైన అభ్యర్థులు. వారి పిటిషన్లపై జులై ఫస్ట్ వీక్‌లో న్యాయమూర్తి జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు వాదనలు విన్నారు. గ్రూప్‌-1కు ఎంపిక కాని అభ్యర్థులతో అపోహలతో పిటీషన్లు వేశారన్న టీజీపీఎస్సీ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు.

 

మెయిన్స్ పత్రాల మూల్యాంకనం పారదర్శకంగా జరిగిందని ప్రభుత్వం తెలిపింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం, అభ్యర్థులకు సంబంధించిన అడ్వకేట్ వాదనతో ఏకీభవించింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌ మెయిన్స్ పేపర్లు రీ వాల్యూయేషన్ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అభ్యర్థులు.