తెలంగాణలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ దంపతుల మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తోంది. సోమవారం నాడు మంత్రి కొండా సురేఖ తన భర్త కొండా మురళితో కలిసి జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. కొండా దంపతులు నేరుగా సీఎంను కలిసి విషెస్ చెప్పడంతో, వీరి మధ్య అంతర్గత వివాదానికి తెరపడినట్లు కనిపిస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పార్టీలో ఎలాంటి వివాదాలు లేకుండా చూసేందుకు అంతా సర్దిచెప్పినట్లు సమాచారం.
కొన్ని రోజుల కిందట పోలీసులు మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత నివాసానికి తనిఖీలకు వెళ్లడంతో ఈ వివాదం మొదలైంది. ఎలాంటి నోటీసులు లేకుండా పోలీసులు తనిఖీలకు రావడంపై సుస్మిత అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా చేసిన సుమంత్ కోసం పోలీసులు వచ్చారని, అయితే ఉద్దేశపూర్వకంగానే మహిళా మంత్రి అయిన తన తల్లిని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని సుస్మిత ఆరోపించారు. ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రతిపక్షాలు సైతం మహిళా మంత్రులను రేవంత్ రెడ్డి ఇబ్బంది గురిచేస్తున్నారని విమర్శించాయి.
ఈ ఆరోపణలు, విమర్శల సమయంలో కొండా సురేఖ నివాసం వద్ద భద్రతను తగ్గించడం, ఆమెను మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం కూడా జరిగింది. తమకు జరుగుతున్న అన్యాయాన్ని కొండా సురేఖ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు జోక్యం చేసుకుని, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో విభేదాలు పక్కనపెట్టి, పార్టీ విజయం కోసం పనిచేయాలని ఆదేశించినట్లు సమాచారం. దాంతో కొండా సురేఖ మంత్రి పదవి గండం నుంచి బయట పడ్డారని తెలుస్తోంది.

