TELANGANA

ఢిల్లీ పేలుడుతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్: హైదరాబాద్‌లో సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో నాకాబందీ తనిఖీలు

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం 6.52 గంటల ప్రాంతంలో పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ పేలుడులో ఇప్పటివరకు 10 మంది మరణించగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుకు గల కారణాలపై ఎన్ఐఏ (NIA), ఎన్ఎస్‌జీ (NSG) అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఢిల్లీలో జరిగిన ఈ ఉగ్రదాడి నేపథ్యంలో, హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు సీపీ సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని పలు కీలక ప్రాంతాల్లో నాకాబందీ ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోమవారం కావడంతో పర్యాటక ప్రాంతాలకు, మార్కెట్లకు సెలవు ఉండటం వల్ల ప్రమాద తీవ్రత కొంత తగ్గిందని స్థానికులు భావిస్తున్నారు.

నగరంలో భద్రతను పటిష్టం చేసిన సీపీ సజ్జనార్, ప్రజలకు కూడా కీలక సూచనలు జారీ చేశారు. ఎక్కడైనా అనుమానస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు. ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంలో భాగంగా హైదరాబాద్ పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.