సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదంలో మృతి చెందిన 45 మందిలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ఉన్నారు. హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నజీరుద్దీన్ కుటుంబంలోని పద్దెనిమిది మంది ఈ ఘోర ప్రమాదంలో మరణించారు. నజీరుద్దీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి మక్కా యాత్రకు వెళ్లగా, మక్కా నుంచి మదీనా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనతో నజీరుద్దీన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది, మృతుల్లో మహిళలు, చిన్నారులు, పురుషులు ఉన్నారు.
ఈ విషాద వార్త తెలియగానే, విద్యానగర్‌లోని నజీరుద్దీన్ నివాసం వద్ద పెద్దయెత్తున బంధువులు, స్నేహితులు చేరుకొని అక్కడున్నవారిని పరామర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అలాగే, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా వెళ్లి పరామర్శించారు.
సౌదీ అరేబియాలో జరిగిన ఈ బస్సు ప్రమాదంలో మొత్తం 45 మంది హైదరాబాద్‌కు చెందినవారు మరణించిన సంగతి తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఇంతమంది మృతి చెందడంతో విద్యానగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించడంతో పాటు, భౌతిక కాయాలను స్వదేశానికి తీసుకురాలేక అక్కడే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

