తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వందల కోట్ల నష్టాన్ని కలిగించిన పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం స్వస్థలమైన రవి, బీఎస్సీ కంప్యూటర్స్ చదివి, హ్యాకింగ్‌పై పట్టు సాధించాడు. ఇన్నేళ్లుగా అజ్ఞాతంలో ఉండి, కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ పౌరసత్వం తీసుకుని అక్కడి నుంచే ఐబొమ్మ సైట్‌ను నడిపినట్లు తెలిసింది. ఇతను ఏకంగా 65కి పైగా మిర్రర్ సైట్లు నిర్వహించి, బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం ద్వారా కోట్లు సంపాదించినట్లు పోలీసులు వెల్లడించారు. అతని దగ్గర పట్టుబడిన హార్డ్ డిస్కుల్లో హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఏకంగా 25 వేల సినిమాలు ఉన్నట్లు గుర్తించారు.
సామాన్య ప్రేక్షకులకు అనధికార ఓటీటీగా మారిన ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా రవి, కొన్ని గంటల్లోనే థియేటర్లలో రిలీజైన సినిమాల HD ప్రింట్‌లను అందుబాటులోకి తెచ్చి ఇండస్ట్రీకి తీవ్ర సవాలు విసిరాడు. సినిమా ఇండస్ట్రీ పెద్దలు, నిర్మాతలు ఈ అరెస్ట్‌పై ఆనందం వ్యక్తం చేయగా, కొంతమంది సినీ ప్రేక్షకులు మాత్రం ఇతన్ని అభినవ రాబిన్ హుడ్‌గా అభివర్ణిస్తూ, “టికెట్ రేట్లు పెంచుతున్న నిర్మాతలకు ఎదురు నిలిచిన హీరో” అంటూ సానుభూతి చూపడం గమనార్హం. అయితే, అతను 50 లక్షల మందికి సంబంధించిన సబ్‌స్క్రైబర్ డేటాను దొంగలించినట్లు తేలడంతో, ఉచిత సినిమా ఆనందం వెనుక ఉన్న అసలు నిజంపై ప్రజలు ఆశ్చర్యపోయారు.
పోలీసుల విచారణలో రవి తన నేర జీవితం వెనుక కారణాలను సెంటిమెంట్ కోణంలో వివరించాడు. వెబ్ డిజైనర్‌గా చాలీ చాలని ఆదాయంతో ఉన్నప్పుడు, తన భార్య, అత్తల నుంచి ఎదుర్కొన్న అవమానాలే తనలో కసి పెంచి, హ్యాకింగ్ ద్వారా పైరసీలోకి అడుగు పెట్టేలా చేశాయని చెప్పాడు. ఇతను పైరసీ ద్వారా సుమారు రూ. 20 కోట్ల పైమాటే సంపాదించగా, అందులో రూ. 3 కోట్లను పోలీసులు సీజ్ చేశారు. ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత పోలీస్ కమీషనర్ సజ్జనార్ తో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున వంటి వారు ప్రెస్ మీట్ నిర్వహించి, ఈ వ్యవహారంపై మాట్లాడారు. ఐబొమ్మ వెబ్ సైట్లను పోలీసులు పూర్తిగా బ్లాక్ చేయించారు.

