TELANGANA

ఆ విషయంలో రేవంత్‌కు 1000 శాతం సహకరిస్తాం: నిండు సభలో కేటీఆర్ హామీ..

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి సభ్యుల మధ్య అనేక అంశాలపై వాగ్యుద్ధం నడుస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయం, ఉచిత విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన.. వంటి రంగాలపై కాంగ్రెస్ సభ్యులు.. గత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తోన్నారు. వీటిని బీఆర్ఎస్ సభ్యులు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోన్నారు.

 

డ్రగ్స్ నిర్మూలన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ సభ్యుడు- మాజీ మంత్రి కేటీఆర్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ను మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు.

 

బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్ వ్యాపారం కొనసాగిందని, ఆ విషయంలో తెలంగాణ పంజాబ్‌ను మించిపోయిందని ఆరోపించారు. హైదరాబాద్‌ను డ్రగ్స్ పెడ్లర్స్ తమ షెల్టర్ జోన్‌గా మార్చుకున్నారని విమర్శించారు. డ్రగ్స్ నిర్మూలనకు తాము ప్రాధాన్యత ఇస్తోన్నామని, ఈ విషయంలో పోలీస్ యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని అన్నారు.

 

ఈ విమర్శలను కేటీఆర్ తిప్పికొట్టారు. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరోను ఏర్పాటు చేసిందే తమ ప్రభుత్వమని గుర్తు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అదనపు పోలీస్ డైెరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ వంటి సమర్థుడైన అధికారిని దీనికి చీఫ్‌గా నియమించామని పేర్కొన్నారు.

 

తొమ్మిది నెలల కిందటే అన్ని జిల్లాల పోలీస్ సూపరింటెండెట్లతో ఓ పకడ్బందీగా యాంటీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశామని కేటీఆర్ వివరించారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత సీవీ ఆనంద్‌ను ఆ స్థానం నుంచి బదిలీ చేసిందని, దీని వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.

 

డ్రగ్స్ విషయంలో పంజాబ్‌ను మించిపోయిందంటూ రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను కేటీఆర్ తిప్పికొట్టారు. మొన్నటివరకు పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని గుర్తు చేశారు. డ్రగ్స్ నిర్మూలన విషయంలో భిన్నాభిప్రాయాలు లేవని, అలాంటి పరిస్థితే ఉంటే టీఎస్ న్యాబ్‌ను ఎందుకు ఏర్పాటు చేస్తామని ప్రశ్నించారు.

 

డ్రగ్స్‌ను నిర్మూలించే విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీఆర్ఎస్ నుంచి వంద శాతం కాదు.. వెయ్యి శాతం మద్దతు ఉంటుందని, పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.