తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కట్టుతప్పుతున్నారనే విమర్శలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి సస్పెండ్‌కు గురయ్యారు. సస్పెన్షన్ వేటు పడ్డాక కూడా ఆయన ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. అయినా రాజా సింగ్ విషయంలో బీజేపీ నాయకత్వం ఏమీ చేయలేకపోతోందన్న వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా ఉంది.
తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశంసించడం పార్టీలో మరో వివాదానికి దారితీసింది. ఇటీవల ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో పాయల్ శంకర్ ఆయన వెంట ఆసాంతం ఉన్నారు. అయితే, తర్వాత జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు కూడా చేయనంతగా ప్రశంసల జల్లు కురిపించడమే ఈ చర్చకు కారణమైంది. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉప్పు నిప్పుగా ఉన్న నేపథ్యంలో, బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ సీఎంను పొగడటంపై రాష్ట్ర నాయకులు సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది.
నియోజకవర్గ పనుల కోసం ముఖ్యమంత్రిని కోరడం సహజమే అయినప్పటికీ, బహిరంగ సభలో సొంత పార్టీ నేతల కంటే ఎక్కువగా ప్రశంసించడం ఏంటని ప్రశ్నిస్తూ, కొందరు రాష్ట్ర నేతలు ఇప్పటికే పాయల్ శంకర్‌పై కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడిన మాటలు, పత్రికా క్లిప్పింగ్‌లను కూడా జాతీయ నాయకత్వానికి పంపినట్లు చెబుతున్నారు. రాజా సింగ్‌నే ఏమీ చేయలేని పార్టీ నాయకత్వం తనను ఏం చేయగలదనే ధీమాలో పాయల్ శంకర్ ఉన్నట్లు కనిపిస్తుండగా, తెలంగాణ బీజేపీలో క్రమశిక్షణ లోపంపై అంతర్గత చర్చలు జరుగుతున్నాయి.

