TELANGANA

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి..

హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బజార్ ఘాట్ లోని రసాయన గిడ్డంగిలో ప్రమాదం జరిగింది. మంటలు నాలుగో అంతస్థు వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందారని ఉస్మానియా హాస్పటల్ సూపరింటెండెంట్‌ డాక్టర్ నాగేందర్ తెలిపారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. నాలుగు రోజుల పసికందుతో పాటు మరో ఇద్దరు మహిళలు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 18 ఏళ్ల దలహర్ కండిషన్ సీరియస్ గా ఉందని ఆయన తెలిపారు. ప్రత్యేక బృందాల ద్వారా మెరుగైన చికిత్స చేస్తున్నామని తెలిపారు. 48 గంటలు అయితే తప్ప.. దలహర్ ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని చెప్పారు.

 

గ్రౌండ్ ఫ్లోర్‌లో కారు మెకానిక్ షెడ్ నిర్వహిస్తున్నారు. కారును రిపేర్ చేసే సమయంలో మంటలు ఎగిసిపడటంతో పక్కనే ఉన్న కెమికల్స్ డబ్బాలు పేలాయి. దీంతో మంటలు వ్యాపించాయి. కాంప్లెక్స్ మొదటి అంతస్థులోని కెమికెల్ గోదాంలో భారీగా కెమికల్స్ నిల్వ ఉంచడం వల్లే మంటలు వ్యాపించేయని స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కొంతమందిని కాపాడారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

 

మూడు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటల్లో కొంతమంది, పొగతో ఊపిరాడక మరికొంతమంది చనిపోయారు. మంటలు ధాటికి రోడ్డపక్కన ఉన్న వాహనాలు సైతం కాలిపోయాయి.