TELANGANA

కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే సింగరేణి నష్టాలు.. హస్తానికి ఓటు వేస్తే 60 ఏళ్లు వెనక్కి : సీఎం కేసీఆర్ .

సింగరేణి (Singareni) సంస్థకు నష్టాలు రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని, బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో తీసుకున్న నిర్ణయాల వల్లే సింగరేణి లాభాలబాట పట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఆదివారం బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు.

 

సీఎం కేసీఆర్ ఆ సభలో మాట్లాడుతూ.. “సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి.. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు దానిని కేంద్రం చేతిలో పెట్టాయి. సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానికి అప్పగించి.. సంస్థ నష్టాల్లో కూరుకుపోవడానికి కాంగ్రెస్ నాయకులే కారణం. గత పదేళ్లలో బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాల వల్లే సింగరేణి లాభాలబాట పట్టింది. సంస్థ మరిన్ని లాభాలు పొందేందుకు బీఆర్ఎస్ వద్ద స్పష్టమైన ప్లాన్ ఉంది.తొమ్మిది ఏళ్లుగా కార్మికులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటున్నాం.. 5 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కార్మికుల కోసం ఆ పార్టీ ఏం చేసిందో చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని.. సరైన అభ్యర్థిని ఎంచుకోవడం పౌరుల బాధ్యత. పార్టీల అభ్యర్థులను చూసి ఓటేయాలి. కాంగ్రెస్ ని నమ్మి ఓటేస్తే మళ్లీ 60 ఏళ్లు వెనక్కి వెళ్తాం. 50 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని ఎన్నో పనులు బీఆర్ఎస్ వచ్చాక చేశాం. 70 శాతం పూర్తయిన సీతారామ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి నేనే ప్రారంభించడానకి వస్తా,” అని ఆయన చెప్పారు.