APTELANGANA

జ్ఞానవాపి మసీదు: అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మసీదులోని వాజుఖానాలో బయటపడిన శివలింగం వయస్సును నిర్ధారించేందుకు కార్బన్ డేటింగ్ పరీక్షలకు అలహాబాద్ హైకోర్టు ఇటీవల అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.

అయితే, తాజాగా, అలహాబాద్ హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు విభేధించింది. ఈ అంశంపై మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ కార్బన్ డేటింగ్ నిర్వహించొద్దంటూ హైకోర్టు తీర్పుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం స్టే విధించింది. కాగా, జ్ఞానవాపి మసీదులోని శివలింగానికి కార్బన్ డేటింగ్ కు అనుమతిస్తూ మే 12న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. మసీదు నిర్వాహకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. మసీదు నిర్వాహకుల పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలను ఆదేశించింది.

వీలైనంత త్వరగా శాస్త్రీయ సర్వేను నిర్వహించాలని కోరగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అంగీకరించాయి. శివలింగం వయస్సును నిర్ధారించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలుంటే భారత పురావస్తు సర్వే(ASI) అధికారులతో సంప్రదించి యూపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.

అలహాబాద్ కోర్టు తీర్పు ఇలా..

జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్‌లో కనుగొనబడిన ‘శివ్‌లింగం’కు కార్బన్ డేటింగ్ నిర్వహించడానికి అలహాబాద్ హైకోర్టు గత శుక్రవారం పురావస్తు శాఖ (ASIకు అనుమతినిచ్చింది. అయితే శివలింగం నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగకూడదని కోర్టు స్పష్టం చేసింది.

హిందూ పక్షం ప్రశ్నార్థకమైన నిర్మాణాన్ని ‘శివలింగం’ అని పిలుస్తుండగా.. ముస్లిం పక్షం ఈ వస్తువు ‘వజూఖానా’ రిజర్వాయర్ వద్ద వాటర్ ఫౌంటెన్ మెకానిజంలో భాగమని పేర్కొంది. ఈ క్రమంలో ఇక్కడి శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలని హిందూ పక్షం తరపున పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలోనే అలహాబాద్ హైకోర్టు ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది.

అయితే, మే 16, 2022న జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్‌లో కనుగొనబడిన శివలింగం లాంటి నిర్మాణంపై శాస్త్రీయ పరిశోధన నిర్వహించాలని హిందూ ఆరాధకుల అభ్యర్థనను వారణాసి కోర్టు గత సంవత్సరం తిరస్కరించింది. తాజాగా, అలహాబాద్ హైకోర్టు కార్బన్ డేటింగ్‌కు అంగీకరించింది.

జ్ఞానవాపి మసీదు కూడా కాశీ విశ్వనాథ్ ఆలయ కాంప్లెక్స్‌లో భాగమేనని.. ఆ మసీదు గోడలపై హిందూ దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయని.. తమకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోర్టును ఐదుగురు మహిళలు కోరడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. అయితే, దీన్ని మసీదు కమిటీ వ్యతిరేకించింది.

ప్రార్థనా స్థలాల చట్టం-1991ని జ్ఞానవాపి మసీదు విషయంలో వర్తింప చేయాలని మసీదు కమిటీ కోరింది. అయితే, గత నెల విచారణ సందర్భంగా జ్ఞానవాపి మసీదుకు ఈ చట్టం వర్తించదని కోర్టు తీర్పు చెప్పింది.