National

“రూ.2వేల నోటు వెనక్కి” ప్రకటనతో ఆర్బీఐ వెబ్‌సైట్ క్రాష్..!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ఒక్కసారిగా క్రాష్ అయ్యింది. రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో అసలు విషయం తెలుసుకునేందుకు చాలామంది నెటిజెన్లు ఆర్బీఐ వెబ్‌సైట్‌ను సందర్శించారు.

దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైట్ క్రాష్ అయ్యింది.

 

రూ.2000 నోట్లు ఇకపై చెలామణిలోకి రావని వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ శుక్రవారం ప్రకటన చేసింది. అయితే రూ.2000 నోట్లను పూర్తిగా రద్దు చేయడం లేదని స్పష్టం చేసిన ఆర్బీఐ ఇప్పటికీ లావాదేవీలకు ఈ నోట్లను వినియోగించుకోవచ్చని పేర్కొంది. అదే సమయంలో రూ.2000 నోట్లను బ్యాంకులు ఇవ్వకుండా నిలువరించాలని అది ఈ క్షణం నుంచే అమల్లోకి వస్తుందని ఆదేశాలు జారీ చేసింది.

ఇక ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులు ప్రత్యేక డిపాజిట్ కేంద్రాలు కానీ ఫెసిలిటీ సెంటర్లు కానీ ఆయా బ్యాంకుల్లో ఉంచాలని పేర్కొంది. రూ.2000 నోట్లను మార్చుకునేందుకు లేదా డిపాజిట్ చేసేందుకు 2023 సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. రూ.2000 నోటును ఏ బ్యాంకులో అయినా మార్చుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది. అయితే ఒకేసారి రూ.20వేలు విలువ చేసే రూ.2వేల నోట్లను డిపాజిట్ చేసేందుకు లేదా మార్చుకునేందుకు అనుమతించింది.