TELANGANA

మెస్సీ హైదరాబాద్ షెడ్యూల్: ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు – పూర్తి కార్యక్రమం వివరాలు

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఉప్పల్ స్టేడియం వద్ద అపూర్వమైన సందడితో పాటు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ లో భాగంగా భారత్‌కు వచ్చిన మెస్సీ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన అనంతరం తాజ్ ఫలక్‌నుమా హోటల్‌లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి ఉప్పల్ స్టేడియం ఈవెంట్‌కు హాజరవుతారు.

మెస్సీ పర్యటనకు సంబంధించి పూర్తి అధికారిక కార్యక్రమ షెడ్యూల్ ప్రకారం, రాత్రి 7:50కి ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రాత్రి 8:06 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మరియు మెస్సీ మైదానంలోకి ప్రవేశిస్తారు. అనంతరం రాత్రి 8:18కి రాహుల్ గాంధీ మైదానంలోకి దిగనున్నారు. రాత్రి 8:38కి మెస్సీ స్టేడియం చుట్టూ పరేడ్ వాక్ చేస్తూ అభిమానులకు అభివాదం చేస్తారు. రాత్రి 8:53కి ‘గోట్’ కప్‌ను సీఎం మెస్సీకి, ఆ తర్వాత మెస్సీ తన జట్టుకు అందజేస్తారు. రాత్రి 9:10కి ప్రముఖులు వేదిక నుంచి వెళ్తారు.

కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. కోల్‌కతాలో మెస్సీ తొందరగా వెళ్లడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, హైదరాబాద్ పోలీసులు ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో 3 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డీజీపీ శివధర్ రెడ్డి స్వయంగా భద్రతను పర్యవేక్షించారు. ఈ ఈవెంట్‌కు టికెట్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు మరియు స్టేడియం పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ కొనసాగుతుంది.