తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క గారు, ఆదివాసీ సంస్కృతి మరియు ఆత్మగౌరవంపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న వారిని తీవ్రంగా హెచ్చరించారు. ముఖ్యంగా సమ్మక్క-సారలమ్మ జాతర వంటి అంశాలపై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె మండిపడ్డారు. తమ ఆదివాసీ దేవుళ్ల జోలికొచ్చినా, తమ అస్థిత్వాన్ని దెబ్బతీసినా ఊరుకునేది లేదని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా, రాష్ట్రంలో జరిగిన రెండు విడతల పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తాను చాటిందని మంత్రి సీతక్క అన్నారు. గ్రామాలకు పూర్తిస్థాయిలో నిధులు అందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించినట్లు ఆమె తెలిపారు. అంతేకాక, బీసీ కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్ల లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని కూడా ఆమె వెల్లడించారు.
ఇళ్ల నిర్మాణం విషయంలో బీఆర్‌ఎస్ నాయకులు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ కనీసం పది ఇళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంలోనే కొన్ని వేల ఇళ్లను ఇచ్చిందని, మహిళలకు చీరలు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, గ్రూప్ ఉద్యోగాలు ఇస్తుంటే కొంతమందికి కళ్లమంటగా మారి, నీచమైన రాజకీయం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

