చారిత్రక దుర్గం చెరువు (సీక్రెట్ లేక్) దశాబ్దాల కాలంలో ఎలా కుంచించుకుపోయిందో వివరిస్తూ హైడ్రా శాటిలైట్ చిత్రాలను విడుదల చేసింది. ఒకప్పుడు 160 ఎకరాల విస్తీర్ణంతో అలరారిన ఈ చెరువు, నేడు కేవలం 116 ఎకరాలకు పడిపోయింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) సహకారంతో సేకరించిన ఈ చిత్రాలు, 1976 నుండి నేటి వరకు జరిగిన క్రమబద్ధమైన ఆక్రమణలను కళ్లకు కట్టాయి. 1976 నాటికే 29 ఎకరాలు మాయమవ్వగా, ఆ తర్వాతి కాలంలో రాజకీయ అండదండలతో చెరువును మట్టితో పూడ్చివేసి స్థలాలను కబ్జా చేసినట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
ప్రస్తుత చర్యల్లో భాగంగా మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ వెనుక వైపు ఉన్న 5 ఎకరాల కబ్జా స్థలాన్ని హైడ్రా మంగళవారం స్వాధీనం చేసుకుంది. ఇక్కడ చెరువులోకి 10 నుండి 15 మీటర్ల మేర మట్టిని అక్రమంగా డంప్ చేసి, ఆ స్థలాన్ని చదును చేశారు. ఈ ఆక్రమిత స్థలాన్ని ఐటీ కంపెనీల క్యాబ్‌లు, స్కూల్ బస్సుల పార్కింగ్ కోసం వాడుతూ, అద్దెల రూపంలో నెలకు ఏకంగా రూ. 50 లక్షల వరకు దందా నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎటువంటి భూ రికార్డులు లేకున్నా, ఒక ప్రజాప్రతినిధి అండదండలతో ఈ భారీ మాఫియా నడుస్తున్నట్లు విచారణలో తేలింది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు, పార్కింగ్‌లోని వాహనాలను ఖాళీ చేయించి ఆ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఆక్రమణలను తొలగించడమే కాకుండా, చెరువులో పోసిన మట్టిని కూడా బయటకు తీసి పూర్వ వైభవం తెస్తామని ప్రకటించారు. సర్వే ఆఫ్ ఇండియా మరియు రెవెన్యూ రికార్డుల ఆధారంగా చెరువు పూర్తి సరిహద్దులను పక్కాగా నిర్ణయించే పనిలో హైడ్రా నిమగ్నమైంది.

