తెలంగాణలో పోలీస్ అధికారులు తమంతట తాముగా సెర్చ్ వారెంట్లు జారీ చేయడంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏసీపి (ACP), కమిషనర్ స్థాయి అధికారులు వారెంట్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మోహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా అస్సలు పోలీసులకు సెర్చ్ వారెంట్లు ఇచ్చే అధికారం ఎక్కడిదని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది.
పిటిషనర్ విజయగోపాల్ వాదనలు వినిపిస్తూ.. కేవలం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌లకు మాత్రమే ఉండే అధికారాలను పోలీసులు చట్టవిరుద్ధంగా వాడుతున్నారని పేర్కొన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 93 మరియు హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 47లను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘కార్డన్ అండ్ సెర్చ్’ పేరుతో ఎలాంటి వారెంట్లు లేకుండానే ఇళ్లలోకి ప్రవేశించి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన హైకోర్టు.. ప్రజా భద్రత కోసం పోలీసులు చేసే కృషిని అభినందిస్తూనే, ఏ నిబంధనలు లేదా జీవోల ఆధారంగా సెర్చ్ వారెంట్లు జారీ చేస్తున్నారో పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసు శాఖను ఆదేశించింది. ఈ అంశంపై స్పష్టమైన ఆధారాలతో వివరణ ఇవ్వాలని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

