TELANGANA

“ముఖ్యమంత్రి రౌడీలా మాట్లాడుతున్నారు”: రేవంత్ రెడ్డిపై దాసోజు శ్రవణ్ ఫిర్యాదు!

ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను తెలుగుదేశం పార్టీ (TDP) కార్యకర్తలు కలిసి కూల్చివేయాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య హింసను ప్రేరేపించేలా ఒక రౌడీ మాదిరిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్‌ను కలిసి రేవంత్ రెడ్డిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.

ప్రజాస్వామ్యబద్ధంగా, పోరాడి తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను మరియు బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతున బొంద పెడతామని అనడం రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని దాసోజు శ్రవణ్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులను బలితీసుకున్న టీడీపీని బతికించాలని రేవంత్ రెడ్డి ఆరాటపడుతున్నారని, అదే సమయంలో తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టిన బీఆర్ఎస్‌ను అంతం చేయాలని చూడటం దారుణమని ఆయన అన్నారు. ఇది మనుషులు మాట్లాడే భాష కాదని, రాక్షస భాష అని ఆయన మండిపడ్డారు.

రాహుల్ గాంధీ పుణ్యమా అని రేవంత్ రెడ్డి తెలంగాణ పాలిట శాపంగా మారారని దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో అశాంతిని రెచ్చగొడుతున్న ముఖ్యమంత్రిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒక ముఖ్యమంత్రి ముఠా నాయకుడిలా మాట్లాడటం భారత రాజకీయ చరిత్రలోనే ఎక్కడా జరిగి ఉండదని ఆయన దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి నోటి దూల వల్ల తెలంగాణ సమాజం కలుషితం అవుతోందని, దీనిపై ప్రజలు ఆలోచన చేయాలని ఆయన పిలుపునిచ్చారు.