హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా కల్తీ పెరుగు నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంబర్‌పేట పోలీసులు, ఖైరతాబాద్ టాస్క్‌ఫోర్స్ మరియు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల్లో సుమారు 2,500 కిలోల కల్తీ పెరుగు పట్టుబడటం నగరంలో కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా కల్తీ నెయ్యి వార్తలు వినిపిస్తుండగా, ఇప్పుడు ఏకంగా ప్రతిరోజూ ఆహారంలో భాగమైన పెరుగు కూడా కల్తీ అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఈ కల్తీ పెరుగు తయారీలో పాలలో కాస్టిక్ సోడాను వినియోగిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సాధారణంగా పాలను పెరుగుగా మార్చడానికి సహజసిద్ధమైన పద్ధతులు కాకుండా, వేడి పాలలో కాస్టిక్ సోడాను కలపడం ద్వారా దానిని పెరుగు రూపంలోకి మారుస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఇలాంటి కల్తీ పెరుగును తినడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో పాటు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.
దాడులు నిర్వహించిన గోడౌన్ నుంచి సేకరించిన శాంపిళ్లను అధికారులు తదుపరి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. ఈ కల్తీ పెరుగును నగరంలోని వివిధ హోటళ్లు మరియు ఫంక్షన్లకు పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితులపై కేసులు నమోదు చేసిన పోలీసులు, ప్రజలు ఆహార పదార్థాల నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

