హైదరాబాద్: మహిళా సంక్షేమానికి సీఎం చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.
ఆడబిడ్డలను పైకి తీసుకురావాలన్న తపనతో సీఎం చంద్రశేఖర్ రావు అనేక పథకాలను అమలు చేస్తూ దేశానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. మహిళా సంక్షేమానికి ఏ రాష్ట్రం చేయనన్ని పనులు తెలంగాణలో జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరుపుకుంటున్న మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి కవిత శుభాకాంక్షలు తెలిపారు.
షీ టీమ్ లతో మహిళా రక్షణ : కళ్యాణ లక్ష్మితో ఇంటి పెద్దలా, చంద్రశేఖర్ రావు న్యూట్రిషన్ కిట్ తో ఇంటి డాక్టర్ లా, కేసీఆర్ కిట్ తో మేనమామలా, అమ్మఒడి తో సంరక్షకుడిలా, ఆరోగ్య లక్ష్మి తో ఆరోగ్య దాతగా, షీ టీంలతో రక్షకుడిగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అండగా నిలిచారని కవిత పేర్కొన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ తో భరోసానిస్తూ ఒంటరి మహిళలకు చేదోడుగా ఉంటున్నారని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి వారిని రాజకీయ వ్యవస్థలు భాగస్వామ్యం చేసిన ఘనత చంద్రశేఖర్ రావుకు దక్కుతుందని అన్నారు.