ప్రభుత్వ రంగంలోని ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ దేశవ్యాప్తంగా 1,300 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 1,100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) పోస్టులు ఉండగా, 200 అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఏ’ పోస్టులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఊరటనిస్తూ ఒక్క హైదరాబాద్ జోన్ పరిధిలోనే 65 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి (ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం సరిపోతుంది). అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు మాత్రం రెండేళ్ల బ్యాంకింగ్ అనుభవం తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు మార్చి 1, 2026 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి ఏడాదికి రూ.6.14 లక్షల నుండి రూ.6.50 లక్షల వరకు ఆకర్షణీయమైన జీతం లభిస్తుంది. ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.
ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 19వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దరఖాస్తుకు కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. జనరల్ అభ్యర్థులకు రూ.1050, ఎస్సీ/ఎస్టీలకు రూ.250 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. ఏప్రిల్ 12న హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ప్రాంతీయ భాషపై పట్టు కలిగి ఉండటం నిబంధనలలో ఒకటని అధికారులు స్పష్టం చేశారు.

