TELANGANA

జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ కావాలన్న కోమటిరెడ్డి: కాంగ్రెస్‌లో రేగిన దుమారంపై మంత్రి వివరణ

సంగారెడ్డిలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లు వస్తాయని వ్యాఖ్యానించారు. ఈ మాటలు ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపినట్లుగా ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో పీసీసీ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయన్న విమర్శలు రావడంతో మంత్రి వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చారు.

తమ పార్టీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తన మాటలను కొందరు కావాలనే వక్రీకరించారని కోమటిరెడ్డి మండిపడ్డారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనకు ఎన్ఎస్‌యూఐ రోజుల నుండి అత్యంత సన్నిహిత మిత్రుడని ఆయన గుర్తు చేశారు. మహేష్ సారథ్యంలోనే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిందని ప్రశంసించారు. ప్రస్తుత అధ్యక్షుడిని తొలగించాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, మహేష్ కుమార్ గౌడ్ పనితీరు పట్ల తనకు పూర్తి సంతృప్తి ఉందని ఆయన స్పష్టం చేశారు.

జగ్గారెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సంగారెడ్డి కార్యక్రమంలో ఆయన చేసిన జనసమీకరణ, కార్యక్రమ నిర్వహణ తీరు చూసి ముగ్ధుడనై, భవిష్యత్తులో ఆయనకు పీసీసీ అయ్యే అర్హత ఉందని మాత్రమే చెప్పానని కోమటిరెడ్డి వివరించారు. అది కేవలం ఒక నాయకుడి పనితీరును మెచ్చుకోవడమే తప్ప, పదవుల మార్పు కోసమో లేదా ఎవరినో కించపరచడానికో అన్న మాటలు కావని క్లారిటీ ఇచ్చారు. ఈ వివరణతో ప్రస్తుతానికి పీసీసీ వివాదానికి తెరపడినట్లు కనిపిస్తున్నా, కాంగ్రెస్ సీనియర్ల మధ్య ఉన్న పోటీ మాత్రం మరోసారి బహిర్గతమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.