పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరత మరియు డెలివరీలో జాప్యం నెలకొన్నా, నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామస్తులు మాత్రం నిశ్చింతగా ఉన్నారు. ఈ గ్రామంలో గ్యాస్ వినియోగం కంటే ఇండక్షన్ స్టవ్‌ల వాడకమే ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. రెండేళ్ల క్రితం టీజీరెడ్కో ఆధ్వర్యంలో ఇక్కడ పీఎం సూర్యఘర్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేశారు. గ్రామంలోని దాదాపు ప్రతి ఇంటిపైనా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడంతో గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా పోయింది.
గ్రామంలోని మొత్తం 514 ఇళ్లలో ప్రతి ఇంటికీ మూడు కిలోవాట్ల సామర్థ్యంతో సుమారు రూ.10.53 కోట్ల వ్యయంతో సోలార్ ప్యానెళ్లను బిగించారు. దీనివల్ల ప్రతి ఇంటికీ నెలకు సగటున 360 కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. గ్రామస్థులు తమ ఇంటి అవసరాలకు వాడుకోగా మిగిలిన విద్యుత్తును గ్రిడ్‌కు విక్రయిస్తున్నారు. ఇలా మిగులు విద్యుత్తును గ్రిడ్‌కు పంపడం ద్వారా యూనిట్‌కు రూ.5.25 చొప్పున ఆయా కుటుంబాలు అదనపు ఆదాయాన్ని కూడా పొందుతున్నాయి. ఇది అటు గ్యాస్ ఖర్చును ఆదా చేయడమే కాకుండా, గ్రామస్థులకు ఆర్థిక భరోసానిస్తోంది.
సోలార్ పవర్‌ను గరిష్టంగా వినియోగించుకునేలా ప్రభుత్వం గతేడాది 410 కుటుంబాలకు ఉచితంగా ఇండక్షన్ స్టవ్‌లు మరియు కుక్కర్‌లను పంపిణీ చేసింది. ప్రస్తుతం ఆ కుటుంబాలన్నీ పూర్తిస్థాయిలో ఈ-కుకింగ్‌కు మారిపోయాయి. గతంలో నెలన్నరకే సిలిండర్ ఖాళీ అయ్యేదని, ఇప్పుడు ఇండక్షన్ వాడకంతో వంట గ్యాస్ ఆదా అవ్వడమే కాకుండా వంట చేయడం సులభమైందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన ఇళ్లలో కూడా అవగాహన కల్పించి అందరూ సౌర శక్తిని వాడేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో వ్యవసాయానికి కూడా సోలార్ పంపుసెట్లు బిగించే దిశగా ప్రణాళికలు సాగుతున్నాయి.

