APTELANGANA

భారత దేశంతో సహా పలు దేశాల్లో కార్మికుల జీవితాలు

భారత దేశంతో సహా పలు దేశాల్లో కార్మికుల జీవితాలు అంతకంతకూ దిగజారుతుండగా, టాప్ ఎగ్జిక్యూటివ్ లు పైపైకి ఎగబాకుతున్నారు. కార్మికుల వేతనాలు తగ్గుతుండగా టాప్ ఎగ్జిక్యూటివ్ ల జీతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

భారత దేశంలో ఓ టాప్ ఎగ్జిక్యూటివ్ నాలుగు గంటలు చేసే పనికి సంపాదించే వేతనం సగటు కార్మికుడు సంవత్సరమంతా చేసినపనికి పొందే వేతనం కన్నా ఎక్కువగా ఉంది.

భారతదేశం, యుకె, యుఎస్, దక్షిణాఫ్రికాలో 2022లో టాప్ ఎగ్జిక్యూటివ్ ల వేతనాలు 9% పెరగగా, అదే సమయంలో కార్మికుల వేతనాలు 3.19% తగ్గాయని ఆక్స్ ఫామ్ చేసిన సర్వే వెల్లడించింది. మే 1, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం రోజున ఆక్స్ ఫామ్ ఈ వివరాలు వెల్లడించింది.

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO), ప్రభుత్వ గణాంకాల ఏజెన్సీల తాజా డేటా ఆధారంగా ఈ వివరాలు రూపొందించారు.

ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, సంక్షోభాలు వచ్చినప్పుడు కార్మికులు త్యాగాలు చేయాల్సి వస్తుండగా టాప్ ఉద్యోగులు అధిక వేతనాలు పొందుతున్నారు. 2022లో 50 దేశాల్లోని ఒక బిలియన్ కార్మికులు సగటున 685 డాలర్ల వేతన కోతకు గురయ్యారు.

ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అమితాబ్ బెహర్ మాట్లాడుతూ, “తాము అందరి వేతనాలను తగ్గించామని కార్పొరేట్ ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ, నిజానికి వారు తమకు తాము, వారి వాటాదారులకు భారీగా చెల్లిస్తున్నారు. చాలా మంది కార్మికులు అతి తక్కువ వేతనంతో ఎక్కువ గంటలు పని చేస్తున్నారు.

సంవత్సరాల తరబడి సాగుతున్న పెట్టుబడిదారుల కాఠిన్యం, కార్మిక సంఘాలపై దాడులు అత్యంత ధనవంతులు, మిగిలిన వారి మధ్య అంతరాన్ని పెంచాయని బెహర్ అన్నారు.

భారతదేశంలో అత్యధికంగా వేతనాలు పొందే 150 మంది ఎగ్జిక్యూటివ్‌లు 2022లో సగటున 1 మిలియన్ డాలర్లు అందుకున్నారని,ఇది 2021 కన్నా 2% ఎక్కువని ఆక్స్ ఫామ్ పేర్కొంది.