తెలంగాణ మాసీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డి.. తన పాత మిత్రుడిని చూడగానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “అన్నా.. నన్ను దేవుడే పంపాడు.. మీతో కలిసి పని చేయమని” అంటూ కేసీఆర్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అనంతరం జీవన్ రెడ్డి తన కుమారులు.. జగిత్యాల జడ్పీ మాజీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులతో కలిసి ఈ భేటీకి కావడం విశేషం.
ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు తొలిసారి వచ్చిన జీవన్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి తన మనసులోని మాటను కేసీఆర్‌తో పంచుకున్నారు. “తెలంగాణకు నష్టం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరముంది. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకైనా మీతో కలిసి నడిచే అవకాశం రావడం సంతోషంగా ఉంది.” అని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మలుపులు చూసిన ఈ ఇద్దరు సీనియర్ నేతలు ఒక్కటవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ నాయకత్వం మళ్లీ అవసరమని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధి పథం నుండి తప్పుకుంటోందని.. దానిని తిరిగి గాడిలో పెట్టే శక్తి కేసీఆర్‌కే ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ కూడా జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించి సన్మానం చేశారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ కె.సంజయ్, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. జీవన్ రెడ్డి చేరికతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ బలం మరింత పెరగడమే కాకుండా.. కేడర్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది.
రాబోయే రోజుల్లో జీవన్ రెడ్డి అనుభవాన్ని పార్టీ బలోపేతానికి ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ఈ సందర్భంగా ప్రాథమిక చర్చ జరిగినట్లు సమాచారం. తన రాజకీయ ప్రస్థానంలో చివరి అంకాన్ని కేసీఆర్ తో కలిసి సాగించబోతుండటం పట్ల జీవన్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక కలయిక తెలంగాణ రాజకీయ సమీకరణాలను మార్చివేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు

