TELANGANA

ప్రజల్లోకి గులాబీ అధినేత కేసీఆర్..!

గులాబీ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారు. సుమారు ఏడాది తర్వాత ప్రజాఆశీర్వాద సభ పేరుతో మళ్లీ ఎంట్రీ అవుతున్నారు. ఇప్పటివరకు మౌనంగా కేంద్ర, రాష్ట్ర రాజకీయాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఆయన ఎవరిపై మాటల తూటాలు సందిస్తారనే ఆసక్తి ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ నెలకొంది.

 

ప్రజా ఆశీర్వాద సభ

తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలు కానుంది. కొంతకాలంగా కేసీఆర్ రాజకీయాలపై తనదైనశైలీలో విమర్శనాస్త్రాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వంపై సైతం ఘాటు వ్యాఖ్యలు లేవు. తప్పులను ఎత్తిచూపలేదు. అసలు ఏం జరుగుతుంది.. ఎందుకు మౌనంగా ఉన్నారనే చర్చజరుగుతుంది. అయితే కేసీఆర్ మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు. జగిత్యాల వేదికగా ఈ నెల 20న జరగనున్న ‘ప్రజా ఆశీర్వాద సభ’ ద్వారా ఆయన తన గళాన్ని విప్పబోతున్నారు. గతేడాది ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్కతుర్తి(ఉమ్మడి వరంగల్)లో రజతోత్సవ సభ నిర్వహించారు. కేసీఆర్ ఆసభలో మాట్లాడారు.

 

జరుగుతున్న అన్యాయం

ఆతర్వాత తెలంగాణ భవన్ లో డిసెంబర్ 21న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గంతో సమావేశం అయ్యారు. కృష్ణా, గోదావరి జలాలపై జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వతీరును ఎండగట్టారు. పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుపై అనుసరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరీపై సభ నిర్వహిస్తామని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టు దగ్గర సైతం సభ నిర్వహిస్తామని సైతం ప్రకటించారు. కానీ సభలు నిర్వహించలేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలతో ప్రచారానికే పార్టీ సైతం పరిమితం అయింది. దాదాపు ఏడాది కాలం తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడుతుండటంతో రాష్ట్రప్రజలు, పార్టీల నేతల్లోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

జగిత్యాల సభ

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ రాజకీయాలకు కొంత విరామం ఇచ్చారు. ఆరోగ్య కారణాలు, వ్యూహాత్మక మౌనం వెరసి ఆయన జనంలోకి రాలేదు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రైతాంగ సమస్యలు, హామీల అమలులో జాప్యం వంటి అంశాలపై స్పందించేందుకు ఇదే సరైన సమయమని కేసీఆర్ భావిస్తున్నారు. జగిత్యాల సభ ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపడంతో పాటు, బీఆర్ఎస్ ఉనికిని చాటడమే లక్ష్యంగా ఈ సభ రూపుదిద్దుకుంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండటంతో ఇక ప్రజల్లోకి పార్టీ నేతలు వెళ్లాలని.. ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపు ఇవ్వబోతున్నట్లు సమాచారం.

 

నిధుల విషయంలో..

ఈ సభలో కేసీఆర్ ప్రధానంగా అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఆరు గ్యారెంటీలు, హామీలు, రుణమాఫీ, జాబ్ నోటిఫికేషన్లు, డిక్లరేషన్లు, రైతు భరోసా పంపిణీలో జరుగుతున్న ఆలస్యంపై కేసీఆర్ విరుచుకుపడే అవకాశం ఉంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, కరెంట్ కోతలు వంటి అంశాలపై కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీసేందుకు ఆయన అస్త్రాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టబోతున్నారు. అదే విధంగా కేంద్రం విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో బీజేపీ వైఖరిని ఆయన ఎండగట్టే ఛాన్స్ ఉంది. అంతేకాదు ఉపాధిహామీ, ఇరిగేషన్ పై కేంద్రం అనుసరిస్తున్న ద్వంద వైఖరీ, తాజాగా బీజేపీ ఎంపీ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలపై విమర్శనాస్త్రాలు సంధించబోతున్నట్లు సమాచారం. తెలంగాణ నుంచి కేంద్రమంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారిపైనా తనదైనశైలీలో కౌంటర్లు ఇవ్వబోతున్నారు.

 

కమిటీలకు సూచనలు

కేసీఆర్ రాకను పురస్కరించుకుని జగిత్యాలలో నిర్వహించే సభకు పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. సభకు పార్టీ కమిటీలను సైతం వేసింది. ఏర్పాట్లను శనివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు పరిశీలించారు. కమిటీలకు పలు సూచనలు చేశారు. స్థానిక నాయకులు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు పలువురు చేరబోతున్నారు. అందుకోసం ఇప్పటికే సభా ప్రాంగణం సిద్ధమైంది. భారీ స్టేజీ, సౌండ్ సిస్టమ్, ఎండ తీవ్రత దృష్ట్యా జనానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. సభను సాయంత్రం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల నుంచి భారీ జనసమీకరణకు ఇప్పటికే పార్టీ దృష్ఠిసారించింది. నేతలకు బాధ్యతలు సైతం అప్పగించింది. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చేలా ప్రణాళికలు రూపొందించారు.

 

కేసీఆర్ ఇచ్చే పంచ్ డైలాగులు

తెలంగాణలో రాబోయే రాజకీయ పరిణామాలకు ఈ సభ ఒక దిక్సూచిగా మారబోతోంది. కేసీఆర్ చేసే ప్రసంగం బీఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణను స్పష్టం చేయనుంది. తనదైన శైలిలో కేసీఆర్ ఇచ్చే పంచ్ డైలాగులు, రాజకీయ విశ్లేషణల కోసం అటు కేడర్, ఇటు సామాన్య ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏడాది తర్వాత కేసీఆర్ చేస్తున్న ఈ ‘ప్రజా ఆశీర్వాద సభ’ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో నని చూడాలి.