TELANGANA

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి…KCR Survey సర్వేలో షాకింగ్‌ ఫలితాలు

 

తెలంగాణలో మూడోసారి అధికారం చేపట్టి.. 2024లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే అక్టోబర్‌ 5న టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. తాజాగా 2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టారు. ఈ మేరకు అంతర్గత సర్వేల ఆధారంగా పార్టీ పరిస్థితి, నేతల పనితీరును అంచనా వేస్తున్నారు. ఈమేరకు ఇప్పటినుంచే ప్రణాళిక రచిస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను డేంజర్‌ కేటగిరీగా పరగణించారు. ఈ డేంజర్‌ కేటగిరీలో పలువురు మంత్రులు కూడా ఉండడం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీ వీక్‌గా ఉన్న నియోజకవర్గాల బాధ్యతలను మంత్రులతో కూడిన టీఆర్‌ఎస్‌ బృందానికి అప్పగించాలని యోచిస్తున్న కేసీఆర్‌కు.. మంత్రులే వీక్‌గా ఉన్నట్లు నివేదిక రావడం తలనొప్పిగా మారిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

KCR Survey సర్వేలో షాకింగ్‌ ఫలితాలు.. సర్వేల ఆధారంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను, నియోజకవర్గాలను నాలుగు కేటగిరీలుగా కేసీఆర్‌ విభజించారు. ఇటీవల హోరాహోరీగా జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో సాధించిన విజయంతో ఉత్సాహంతో ఉన్న గులాబీ బాస్‌.. వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టారు. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. నేతలు, కార్యకర్తలను ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్ధం చేస్తోన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు, నేతల పనితీరును అంచనా వేస్తూ పార్టీని వచ్చే ఎన్నికల కోసం మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. ఎన్నికలకు పది నెలలు మాత్రమే సమయం ఉండటం, రాష్ట్రంలో బీజేపీ బలం పెంచుకుంటున్న క్రమంలో కేసీఆర్‌ ఎన్నికల శంఖారావం ముందుగానే పూరించారు.

ఇందులో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలు, నేతల పనితీరు, పార్టీ పరిస్థితి ఆధారంగా నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విభజించినట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. సర్వేల ఆధారంగా కచ్చితంగా గెలిచే, కాస్త కష్టపడితే గెలిచే, ట్రయాంగిల్‌ ఫైట్‌ ఉన్న నియోజవర్గాలను గుర్తించి మూడు కేటగిరీలుగా పరిగణించారు. కచ్చితంగా గెలిచే కేటగిరీ ఏలో 38 నుంచి 44, కాంగ్రెస్‌ బలంగా ఉండి కాస్త కష్టపడితే గెలిచే కేటగిరీ బీలో 30 నుంచి 35 నియోజకవర్గాలు ఉండగా.. టీఆర్‌ఎస్, బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య ట్రయాంగిల్‌ ఫైట్‌ ఉన్న మిగతా నియోజకవర్గాలను కేటగిరీ సీ, పార్టీ వీక్‌గా ఉన్న నియోజకవర్గాలను డేంజర్‌ కేటగిరీగా కేసీఆర్‌ గుర్తించినట్లు టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. డేంజర్‌ జోన్‌లో మంత్రులు.. అయితే సర్వేలో పలువురు మంత్రులు కూడా డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కూడిన బృందాన్ని నియమించాలని కేసీఆర్‌ భావిస్తుండగా, మంత్రులే డేంజర్‌ జోన్‌లో ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో మంత్రులతోపాటు, ఎమ్మెల్యేలు డేంజర్‌ జోన్‌లో ఉన్న నియోజకవర్గాల్లో కేటగిరి ఏలో ఉన్న మంత్రులు, ముఖ్య నేతలతో కలిపి బృందం నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఈ బృందం క్యాడర్‌తో తరచూ టచ్‌లో ఉండటం, పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం, నేతల మధ్య సమన్వయం కుదర్చడం లాంటి పనులను ఇన్‌చార్జ్‌లకు అప్పగిస్తారని తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితి బాగానే ఉన్నా.. నేతల పనితీరు బాగా వీక్‌గా ఉన్నట్లు కేసీఆర్‌ గుర్తించినట్లు సమాచారం. గత ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ నుంచి పలువురు మంత్రులు ఓటమి చెందారు. దీంతో ఈసారి కూడా పలువురు మంత్రులు డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు సర్వేల ద్వారా గుర్తించడంతో మరోసారి మంత్రుల టెన్షన్‌ కేసీఆర్‌కు పట్టుకుంది. KCR Survey టీఆర్‌ఎస్‌ గెలుపుపై ధీమా.. కాగా, తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని కేసీఆర్‌ ధీమాగా ఉన్నారు. అంతర్గత సర్వే ఫలితాల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కంటే సీట్లు తగ్గుతాయని అభిప్రాయపడుతున్నారట. గత ఎన్నికల్లో కేవలం టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య ఫైట్‌ నడిచింది. ఈసారి బీజేపీ రాష్ట్రంలో బలం పుంజుకోవడంతో గత ఎన్నికలతో పోలిస్తే సీట్లతోపాటు ఓట్ల శాతం తగ్గుతుందని గులాబీ బాస్‌ భావిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.