TELANGANA

విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ

వరుస ఘటనలతో బాసర (Basara) ఐఐఐటీ నిత్యం వార్తలో నిలుస్తోంది. దీంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి బాసర సమస్యలపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో క్యాంపస్‌లో ఇటీవల జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఐఐఐటీ బాసర అధికారులపై మండిపడ్డారు. ఇవాళ బాసర ఐఐఐటీ కాన్వొకేషన్‌లో మంత్రి కేటీఆర్ (KTR), విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారులతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ఐఐఐటీ అధికారులపై మండిపడ్డారు. మెస్ కాంట్రాక్టర్లను వెంటనే మార్చాలని వీసీని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. బాసర ప్రాంగణానికి సీఎం కేసీఆర్ (CM KCR) ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.

అనంతరం విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. గత పర్యటన సందర్భంగా తామిచ్చిన హామీలు పురోగతిపై మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు. క్యాంపస్‌లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అంతకుముందు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, యూనిఫాంలు అందజేశారు. హాస్టల్‌ బిల్డింగ్‌పై సోలార్‌ ప్లాంటును మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అదేవిధంగా మంత్రుల సమక్షంలో టీహబ్‌ ప్రతినిధులు ఆర్జీయూకేటీ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. విద్యార్థులు సృజనాత్మకతను పెంచుకోవాలని వాటి వల్లే పైకి ఎదుగుతారని..ప్రపంచంతో పోటీపడగలిగే సత్తా సంతరించుకోగలిగితే ఆపగలిగేవారు ఉండరు అంటూ విద్యార్ధులకు బూస్టప్ ఇచ్చారు కేటీఆర్. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌ కీలక పాత్రపోషిస్తున్నాయని..ఆ దిశగా విద్యార్దులకు కృషి చేయాలని ప్రోత్సహించారు మంత్రి కేటీఆర్ (KTR).