సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నారా.? కాంగ్రెస్ పార్టీలో అస్సలేమాత్రం పరిస్థితులు అనుకూలంగా లేని నేపథ్యంలో వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టిని వీడటం దాదాపు ఖాయమైపోయిందా.? తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీని ఓ ఎంపీ స్థాయిలో కలిశానంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి . తాజాగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ మార్పు ఊహాగానాల గురించి మాట్లాడేందుకు నిరాకరించారు.
ఎన్నికలకు చాలా సమయం వుంది.. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడతాననీ, ప్రస్తుతం తనను గెలిపించిన ప్రజల అభివృద్ధి కోసమే తాను పని చేస్తాననీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి, మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ కాంగ్రెస్ శ్రేణులకు వెంకటరెడ్డి పిలుపునివ్వడం అప్పట్లో చర్చనీయాంశమయ్యింది. ఈ విషయమై షోకాజ్ నోటీసులు అందుకున్న వెంకటరెడ్డి, వివరణ అయితే ఇచ్చారుగానీ, ఆ తర్వాత నుంచి ఆయన్ని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం మానేసింది.