World

పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాట

శుక్రవారం పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళలు, పిల్లలతో సహా కనీసం 12 మంది మరణించారు.

అనేక మంది గాయపడ్డారు.

రేషన్ పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళలు, పిల్లలు సహా పలువురు స్పృహతప్పి పడిపోయారని పాకిస్థాన్ ఎక్స్‌ప్రెస్ న్యూస్ నివేదించింది.

నివేదికల ప్రకారం, ఈ సంఘటన కరాచీలోని SITE (సింధ్ ఇండస్ట్రియల్ ట్రేడింగ్ ఎస్టేట్) ప్రాంతంలో జరిగింది. శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారిలో తొమ్మిది మంది మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారని జియో న్యూస్ నివేదించింది.

రంజాన్ సందర్భంగా ఓ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రజలకు ఉచిత ఆహార పంపిణీ చేపట్టింది. అసలే ఆర్థిక సంక్షోభంతో ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్న ప్రజలు ఈ ఫ్యాక్టరీ దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. దాంతో తీవ్ర తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఫ్యాక్టరీ యాజమానులతో సహా, పలువురు సిబ్బందిని అరెస్టు చేశారు.

గత వారం పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత గోదుమపిండి పంపిణీ కార్యక్రమం సందర్భంగా చెలరేగిన ఇలాంటి తొక్కిసలాటలోనే 4గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

పాకిస్తాన్‌లోని అనేక ప్రాంతాలలో ఇటీవలి కాలంలో గోదుమ పిండి కోసం జరిగిన తొక్కిసలాటల్లో 11 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ట్రక్కులు, డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల నుండి ప్రజలు వేలాది బస్తాల పిండిని కూడా దోచుకున్నారని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.