World

ప్రధాని మోడీకి యూఏఈ అధ్యక్షుడు ప్రత్యేక విందు: భారత్-యూఏఈల మధ్య కీలక ఒప్పందాలు

దుబాయ్: ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈకి చేరుకున్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ శనివారం అబుదాబికి చేరుకున్నారు.

ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు చోటు చేసుకున్నాయి.

సరిహద్దు లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, వారి చెల్లింపు, సందేశ వ్యవస్థలను ఇంటర్‌లింక్ చేయడానికి భారతదేశం, యూఏఈ సెంట్రల్ బ్యాంక్‌లు రెండు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. “భారత్-యుఎఇ సహకారంలో ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది మెరుగైన ఆర్థిక సహకారానికి మార్గం సుగమం చేస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక పరస్పర చర్యలను సులభతరం చేస్తుంది’ అని ప్రధాని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా, అబుదాబిలో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ శాఖను స్థాపించడానికి రెండు దేశాల విద్యా మంత్రిత్వ శాఖలు, IIT-ఢిల్లీ కూడా ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ‘ఇది మా విద్యా అంతర్జాతీయీకరణలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. భారతదేశం ఆవిష్కరణ పరాక్రమానికి నిదర్శనం. విద్య అనేది మనల్ని కలిపే బంధం, ఇది ఆవిష్కరణలను వెలిగించే స్పార్క్. కలిసి, మనం ఈ శక్తిని పరస్పర శ్రేయస్సు, ప్రపంచ అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటాము’ ప్రధానమంత్రి ట్వీట్ చేశారు.

ఆ తర్వాత అధ్యక్ష భవనంలో ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు యూఈఏ అధ్యక్షుడు షేక్ మహ్మద్. స్థానికంగా సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలతో పూర్తిగా శాకాహార పదార్థాలతో తయారు చేసిన విందును ప్రధాని మోడీకి వడ్డించారు. గోధమలు, ఖర్జూర సలాడ్‌లతో పాటు మసాలా సాస్, కాల్చిన కూరగాయలను స్టార్టర్లుగా అందించారు. ఈ విందుకు విచ్చేసిన ప్రముఖులకు క్యాలీఫ్లవర్, క్యారెట్ తందూరి, నల్ల పప్పు, హారీస్‌లను ప్రధానంగా వడ్డించారు. వీటితోపాటు స్థానికంగా పండించిన పండ్లను కూడా అందించారు. ఈ వంటకాల్లో వాడిన నూనె కూడా కూరగాయలతో తయారు చేసిందే కావడం గమనార్హం. ఈ విందులో పాలు, గుడ్డుతో తయారు చేసిన పదార్థాలు లేవని తెలిసింది.

‘హెచ్‌హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలవడం ఎల్లప్పుడూ సంతోషదాయకం. ఆయన శక్తి ,అభివృద్ధికి సంబంధించిన దృక్పథం ప్రశంసనీయం. మేము సాంస్కృతిక మరియు ఆర్థిక సంబంధాలను పెంపొందించే మార్గాలతో సహా భారతదేశం-యూఏఈ సంబంధాల పూర్తి స్థాయి గురించి చర్చించాము’ అని ప్రధాని ట్వీట్ చేశారు. యూఏఈతో భారతీయులు ఎప్పుడూ సోదర భావంతో ఉంటారని ఆ దేశ అధ్యక్షుడికి ప్రధాని చెప్పారు.

 

COP-28, యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ నాయకత్వాన్ని ఈ సంవత్సరం UAE తీసుకుంటుందని, అందులో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. COP28 అధ్యక్షుడిగా నియమించబడిన సుల్తాన్ అల్ జాబర్‌ను కూడా కలుసుకున్నారు. వాతావరణ సమావేశానికి UAE అధ్యక్ష పదవికి భారతదేశం పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం యూఏఈ పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ ఢిల్లీకి బయల్దేరారు.