World

57 దేశాల్లో వీసా-ఫ్రీ ఎంట్రీ…

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో ఒక్కో దేశానిది ఒక్కో స్టైల్. వీసా అవసరం లేకుండానే ఏ దేశానికైనా వెళ్లగలిగితే పర్యాటకులకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? అందుకే చాలా దేశాలు ఆ విధానాన్నే అనుసరిస్తున్నాయి. వీసా రహితంగా భారతీయులు తమ దేశంలో పర్యటించొచ్చని థాయ్‌లాండ్ తాజాగా ప్రకటించింది. ఆ మేరకు ఈ నెల 10 నుంచి వచ్చే ఏడాది మే 10 వరకు సడలింపు ఇచ్చింది.

 

ఈ ఒక్క దేశమే కాదు.. మొత్తం 57 దేశాల్లో వీసా లేకుండానే మనం పర్యటించే వీలుంది. వీటిలో కొన్ని దేశాలు వీసా-ఫ్రీ ట్రావెల్‌ను అనుమతిస్తే.. మరికొన్ని వీసా-ఆన్-ఎరైవల్, ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ సదుపాయాలను కల్పిస్తున్నాయి. కుక్ ఐలాండ్స్, మారిషస్, భూటాన్, హాంకాంగ్, బార్బడోస్ దేశాలు భారతీయ పాస్ పోర్టు హోల్డర్లకు వీసా-ఫ్రీ ఎంట్రీని అనుమతిస్తున్నాయి.

 

న్యూజిలాండ్ పరిధిలో పసిఫిక్ సముద్రంలో ఉన్న కుక్ ఐలాండ్స్ లో వీసా లేకుండానే మనం 30 రోజుల వరకు ఉండొచ్చు. మన దగ్గర పాస్‌పోర్టు ఉంటే చాలు. ఇక మారిషస్‌లో మూడు నెలల పాటు ఉండొచ్చు. భారత్‌ సహా 100 దేశాలకు వీసా-ఫ్రీ ఎంట్రీ సదుపాయం కల్పించింది.

 

మన పక్కనే ఉన్న భూటాన్ లో ఎలాంటి వీసా లేకుండానే 7 రోజుల వరకు తిరిగి రావొచ్చు. పాస్‌పోర్టు, అది లేకుంటే ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. హాంకాంగ్‌లో భారతీయులు వీసా అవసరం లేకుండా రెండు వారాల పాటు స్టే చేయొచ్చు. బీచ్లకు ప్రసిద్ధి పొందిన ద్వీపదేశం బార్బడోస్‌లో టూరిస్టు వీసా లేకుండానే 90 రోజుల వరకు గడపొచ్చు.

 

హిందూ మహాసముద్రంలోని దీవుల సమాహారమైన సీషెల్స్ వీసా-ఫ్రీ దేశమే అయినా.. అక్కడ దిగిన వెంటనే పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. 30 రోజుల వరకు స్టే చేసేలా వీసా-ఆన్-అరైవల్ సదుపాయం అక్కడ అమల్లో ఉంది. మాల్దీవులు, టాంజేనియా దేశాల్లోనూ ఈ విధానం అమల్లో ఉంది. పర్యాటకులు 90 రోజులు ఆయా దేశాల్లో పర్యటించొచ్చు.

 

ఇండొనేషియాలో వీసా-ఆన్-అరైవల్ కాలపరిమితి నెల రోజులే. కానీ ఆ తర్వాత కూడా దానిని పొడిగించుకునే సౌలభ్యం ఉంది. ప్రకృతి అందాలకు నెలవైన సమోవాలో 60 రోజుల వీసా-ఆన్-అరైవల్ సదుపాయాన్ని టూరిస్టులు వినియోగించుకోవచ్చు.