పాకిస్తాన్లో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను జైల్లో చూపించాలని డిమాండ్ చేస్తూ తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయనను కలవడానికి వచ్చిన సోదరీమణులపై పోలీసులు అమానుషంగా దాడి చేయడంతో పరిస్థితి మరింత ఉత్కంఠకు దారితీసింది. ఈ నేపథ్యంలో, అఫ్గానిస్తాన్ మరియు పాకిస్తాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలు ఇమ్రాన్ ఖాన్‌ను జైల్లోనే “రహస్యంగా హత్య చేశారు” అంటూ సంచలన ప్రకటనలు చేశాయి. అఫ్గానిస్తాన్ టైమ్స్ ఒక పోస్ట్‌లో, “పాకిస్తాన్‌లోని విశ్వసనీయ వనరు తెలిపిన సమాచారం ప్రకారం, ఇమ్రాన్ ఖాన్‌ను రహస్యంగా హత్య చేసి, ఆయన శరీరాన్ని జైలు నుండి బయటకు తరలించారు” అని పేర్కొంది.
ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు – నూరీన్ నియాజీ, అలీమా ఖాన్, డాక్టర్ ఉజ్మా ఖాన్ – తమ అన్నను కలిసేందుకు అనుమతి కోరుతూ అడియాలా జైలు వెలుపల శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. అయితే, ఏ హెచ్చరిక లేకుండా వీధి లైట్లు ఆర్పేసి, చీకట్లోనే పంజాబ్ పోలీసులు తమపై దారుణంగా దాడి చేశారని నూరీన్ నియాజీ ఆరోపించారు. “71 ఏళ్ల వయసులో నా జుట్టు పట్టుకుని నేలకేసి తోసి, రోడ్డుమీద లాగుతూ వెళ్లారు. నాకు గాయాలయ్యాయి” అని ఆమె వివరించారు. ఈ దాడిని ఆమె “శాంతియుత నిరసనకారులపై పోలీసులు విచక్షణారహితంగా శక్తి ప్రయోగం చేస్తున్న తీరు”కు నిదర్శనంగా పేర్కొన్నారు.
మరోవైపు, ప్రభుత్వం గత నెల రోజులుగా ఇమ్రాన్ ఖాన్‌ను ఎవ్వరూ కలవకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఖైబర్-పఖ్తున్ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ ఆఫ్రీది కూడా ఇమ్రాన్‌ను కలిసేందుకు చేసిన ఏడుసార్ల ప్రయత్నాలను జైలు అధికారులు అడ్డుకున్నారు. ఈ సంఘటనలతో పాటు, వేలాది మంది పీటీఐ కార్యకర్తలు రావల్పిండి అడియాలా జైలు వద్ద చేరి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ హత్యకు సంబంధించిన వదంతులకు Dawn, Al Jazeera, లేదా PTI పార్టీ నుంచి ఎటువంటి అధికారిక ధృవీకరణ రాలేదు.

