World

ఇండియాలో పండే గోధుమలు అరబ్ దేశాలకు అవసరం

ప్రపంచం ఇప్పుడు ఓ కుగ్రామం.. ఒక దేశంపై ఇంకో దేశం పై ఆధారపడటం సర్వసాధారణమైంది. తిండి గింజలు, ఇంధన అవసరాలు, రక్షణ అవసరాలు.. ఇలా ఒక్కటేమిటి గిరి గీసుకొని కూర్చుంటే ఇప్పుడు బతికే రోజులు కావు. ఇండియాలో పండే గోధుమలు అరబ్ దేశాలకు అవసరం. అరబ్ దేశాల్లో లభించే చమురు ఇండియాకు అవసరం. ఇందులో ఏ మాత్రం ఇటు అటు అయితే ఇక అంతే సంగతులు. ఆ ప్రభావం కోట్ల ప్రజలపై పడుతుంది. అందుకే మంచి యుద్ధం చెడ్డ శాంతి ఉండవని బెంజిమెన్ ఫ్రాంక్లిన్ మహాశయుడు ఎప్పుడో చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచానికి కొత్త సవాళ్లు విసురుతున్నది. అసలే ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది అనే సంకేతాలు ఉన్న నేపథ్యంలో… దానికి ఈ యుద్ధం తోడు కావడంతో పరిస్థితి నానాటికి చేయి దాటిపోతుంది. -ఆహార, ఇంధన సంక్షోభం ప్రపంచాన్ని నడిపే కీలక రంగాల్లో ఆహారం, ఇంధనం ముందు వరుసలో ఉంటాయి. కానీ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచానికి కొత్త సవాళ్ళను తెచ్చిపెట్టింది. దీనివల్ల భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి.

దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముక్కలవుతోంది. అందువల్ల కీలకమైన ఉత్పత్తులు, ఇతర సరఫరాల కోసం కేవలం ఏదో ఒక దేశం లేదా ప్రాంతం పైనే ఆధారపడి ఉండటం మంచిది కాదు. యుద్ధం మంటలు చల్లారకముందే కామోడిటీల ధరలు చుక్కలనంటుతున్నాయి. సరఫరా వ్యవస్థలో అంతరాయాలు తీవ్రంగా ఏర్పడుతున్నాయి. దీనివల్ల ధరలు పెరగడం అన్ని దేశాల సమస్యగా మారింది.. అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ధరల పెరుగుదల దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరింది. -జాగ్రత్తగా ఉండాల్సిందే కోవిడ్ ముప్పు తప్పించుకున్న తర్వాత యూరప్ యుద్ధం చుక్కలు చూపిస్తోంది. ప్రపంచ దేశాల్లో పరపతి విధానాలు కఠిన తరం చేయడం వంటి పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి.. ఇవి తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపుతున్నాయి. ముఖ్యంగా ఆహారం, ఇంధన ధరలు కనివిని ఎరుగని స్థాయిలో పెరుగుతున్నాయి. దీనికి తోడు కొనుగోళ్ళు మందగించాయి. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ టీవీలు, ఫ్రిజ్ లు కొనుగోలు చేయడం నిలిపివేసి డబ్బులు దాచుకోవాలని సూచించాడు. దీనిని బట్టి ఆర్థిక మాంద్యం అనేది ముంచుకొస్తోంది అని హెచ్చరించాడు. ‘

దీనికి నివారణ చర్య అంటూ ఏదీ ఉండదని, జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఇదే సమయంలో అమేజాన్ తన సంస్థలో పనిచేసిన ఉద్యోగులను తొలగించే పనికి శ్రీకారం చుట్టింది. చాలామందికి సంకేతాలు పంపింది. గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి బహుళ జాతి సంస్థలు ఖర్చులు తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా చాలామంది ఉద్యోగులను బయటకు పంపించాయి. జూకర్బర్గ్ అయితే ఉద్యోగులకు క్షమాపణ కూడా చెప్పాడు. ఆర్థిక మాంద్యం తొలి నాళ్ళల్లో పరిస్థితి ఇలా ఉంటే.. మున్ముందు ఊహించుకునేందుకే భయం వేస్తున్నదని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ సరఫరా గొలుసుకట్టు వ్యవస్థను మళ్ళీ గాడిలోకి తీసుకురావడం, ప్రపంచ సమస్యలకు సమన్వయ పరిష్కారాలను కనుగొనటం, మల్టీ నేషనల్ ఇన్స్టిట్యూషన్ల ప్రభావం తగ్గించడం వంటి చర్యలతో ఆర్థిక మాంద్యాన్ని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ ఆ పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు?