తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరుకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు తెరపడింది. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్‌కు ముందు రాష్ట్రవ్యాప్తంగా 48 గంటల కీలకమైన “నిశ్శబ్ద సమయం” (సైలెన్స్ పీరియడ్) అధికారికంగా ప్రారంభమైంది. దీంతో బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రసంగాలకు ఫుల్స్టాప్ పడింది. తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్లో 152 స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 23న తమిళనాడులో ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, బెంగాల్ లో తొలి దశ పోలింగ్ జరగనుంది.
ప్రస్తుత డీఎంకే ప్రభుత్వ పదవీకాలం మే 10న ముగియనుండటంతో, మార్చి 15న ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్, మే 4న ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో, గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. అధికార డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్, అన్నాడీఎంకే నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. వీటికి తోడు నామ్ తమిళర్ కట్చి, నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీలు కూడా స్వతంత్రంగా బరిలో నిలవడంతో ఈసారి చతుర్ముఖ పోటీ ఆసక్తికరంగా మారింది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా అగ్రనేతలంతా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి, భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
ప్రచారం ముగియడంతో, స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాత ఎన్నికల ప్రక్రియను నిర్ధారించేందుకు కఠినమైన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. తమిళనాడు ముఖ్య ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126 ప్రకారం, ఏప్రిల్ 21 సాయంత్రం 6 గంటల నుంచి ఏప్రిల్ 23న పోలింగ్ ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ఈ నిబంధనల ప్రకారం, బహిరంగ సభలు, ఊరేగింపులు, ప్రచార సంబంధిత సమావేశాలను నిర్వహించరాదు. టెలివిజన్, రేడియో, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికలతో పాటు ఎస్ఎంఎస్లు లేదా ఇంటర్నెట్ ద్వారా ఎన్నికల సంబంధిత కంటెంట్‌ను వ్యాప్తి చేయడంపై పూర్తి నిషేధం విధించారు. ఓటర్లను ప్రభావితం చేసే ఉద్దేశంతో సంగీత, నాటక ప్రదర్శనలు వంటి వినోద కార్యక్రమాలను నిర్వహించడం కూడా నిషిద్ధం. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
నియోజకవర్గంలో ఓటర్లు కాని రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు నిశ్శబ్ద సమయం ప్రారంభం కాకముందే ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు కళ్యాణ మండపాలు, హాస్టళ్లు, అతిథి గృహాలపై నిఘా కట్టుదిట్టం చేశారు. అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్లకు జారీ చేసిన వాహన అనుమతులు మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత చెల్లవు. పోలింగ్ రోజున అభ్యర్థులకు పరిమిత సంఖ్యలో వాహనాలకు అనుమతి ఉంటుంది, వాటిని కూడా రిటర్నింగ్ అధికారులు నియంత్రిస్తారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి వాహనాలను అద్దెకు తీసుకోవడం లేదా ఉపయోగించడం పూర్తిగా నిషేధం. అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఇద్దరు వ్యక్తులతో మాత్రమే ఎన్నికల బూత్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడ కూడా జనం గుమిగూడటానికి అనుమతి లేదు.

