కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతల గుండెపోటుకు గురయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన కరీంనగర్ నుండి హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం ఆమె గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
ఆసుపత్రికి చేరుకున్న నిపుణులైన వైద్యుల బృందం ఆమెకు అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించింది. శకుంతల గారి గుండెకు స్టంట్ వేసి, ప్రస్తుతం ఐసీయూలో నిరంతర పర్యవేక్షణలో ఉంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు తన తల్లి అనారోగ్యం గురించి సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ నేరుగా గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రికి వెళ్లిన ఆయన, వైద్యులతో మాట్లాడి అమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

