రాష్ట్రంలో వ్యవసాయ కనెక్షన్లు మినహా అన్ని విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్‌డీఎస్ఎస్)లో చేరాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో శనివారం సమావేశమైన కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కనెక్షన్లు మినహా మిగిలిన అన్ని గృహ, వాణిజ్య కనెక్షన్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు.
గత ప్రభుత్వ ఒప్పందాన్నే అమలు చేస్తున్నాం: మంత్రి పొంగులేటి
కేబినెట్ సమావేశం అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, విద్యుత్ నష్టాలను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అయితే, ఈ ఆర్‌డీఎస్ఎస్ పథకంలో చేరాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కేంద్ర విద్యుత్ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరిందని గుర్తుచేశారు. కానీ, నాటి ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లలేదని, అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వాలే భరిస్తాయని, వినియోగదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం వ్యయంలో 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని అధికారులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటి మరోసారి తేల్చిచెప్పారు.
డిస్కంల ఆదాయ, వ్యయాల మధ్య అంతరాన్ని తగ్గించి, వాటిని ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. కాగా, విద్యుత్ ఛార్జీల పెంపు అంశం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) పరిధిలోనే ఉంటుందని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు, ఛార్జీల పెంపునకు ప్రత్యక్ష సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు.

