TELANGANA

సీఎంను కలిసిన వామపక్షాలు.. పంట కొనుగోళ్లు, మూసీ ప్రాజెక్టుపై రేవంత్ కీలక హామీ..!

సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలుసుకుంది. రాష్ట్రంలో కనీస వేతనాల సవరణ చట్టాన్ని తీసుకువచ్చినందుకు ఈ సందర్భంగా సీఎంకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో పాటు పి. సుదర్శన్, జ్యోతి, నున్నా నాగేశ్వరరావు, మల్లు లక్ష్మి, సామినేని స్వరాజ్యం, ఎం. గోపాలరావు, అలాగే రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

 

కేంద్రం వైఖరిపై మండిపాటు..

 

సీపీఎం నేతలతో జరిగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటిస్తోందే తప్ప, ఆచరణలో గింజ కూడా కొనడం లేదని ఆయన మండిపడ్డారు. పండిన పంటలో 30 శాతం కూడా సేకరించడం లేదని, పంట కొనుగోళ్లపై కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజనూ తమ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. అయితే, బెంగాల్ ఎన్నికల వల్ల కొంత హమాలీల కొరత ఏర్పడిందని, దానికి తోడు ఎండ తీవ్రత వల్ల మధ్యాహ్నం వేళల్లో పనులకు స్వల్ప ఆటంకం కలుగుతోందని వివరించారు. కొనుగోళ్ల ప్రక్రియపై తాను నిరంతరం సమీక్ష చేస్తున్నానని, సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి కొంటున్నామని, మొక్కజొన్నను కూడా మద్దతు ధరకే సేకరిస్తున్నామని సీఎం తెలిపారు.

 

విపక్షాల రాజకీయంపై ఆగ్రహం

 

ఇక మూసీ ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా తిప్పికొట్టారు. ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీలు అనవసరంగా రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ కాలుష్యం కారణంగా నల్గొండ జిల్లా ప్రజలు తీవ్ర రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగర ప్రజలకు నాణ్యమైన జీవనాన్ని అందించడమే తన ముఖ్య ఉద్దేశమని, అందుకే మూసీని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని, అలాగే మూసీ నిర్వాసితులకు స్థానికంగానే ఇళ్ల స్థలాలు, నివాసాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

 

ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రక్షాళన..

 

రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రక్షాళనపై సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇందులో భాగంగానే పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్, భోజనాన్ని అందిస్తున్నామని, కొత్తగా ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం విద్య రంగంలో తీసుకొస్తున్న మార్పులను స్వయంగా పరిశీలించేందుకు, ఆరుట్ల స్కూల్‌ను ఒకసారి సందర్శించాల్సిందిగా సీపీఎం నాయకులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.