AP

మంత్రి లోకేష్‌తో ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ భేటీ..

ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు మంత్రి నారా లోకేష్. అందుకోసం ప్రతీ అవకాశాన్ని ఆయన వినియోగించుకుంటున్నారు. దేశంలో కొత్తగా వస్తున్న పారిశ్రామికవేత్తలు ఎవరు? ఏయే విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారు అనే దానిపై ఫోకస్ చేశారు. మంత్రి లోకేష్‌తో ఎయిర్‌ ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో ముంబైలో సమావేశమయ్యారు.

 

భారీ పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా హైపర్‌ స్కేల్ డేటా సెంటర్లు నిర్వహిస్తున్న ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో ముంబైలో సమావేశం నిర్వహించారు మంత్రి లోకేష్.

 

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి లోకేష్.. విశాఖ సిటీ ఏఐ, డేటా హైపర్‌స్కేల్ హబ్‌గా మారుతోందన్నారు. ఆ ప్రాంతంలో గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్, అదానీ కనెక్స్ వంటి సంస్థలు ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు. డేటా సెంటర్లకు విశాఖ అన్ని విధాలుగా అనుకూలమైన నగరమని దాని సంబంధించి వివరాలు వెల్లడించారు.

 

ఫ్యూచర్ క్యాంపస్ ఏర్పాటుపై ఇరువురు మధ్య చర్చ

 

ఆరు గిగావాట్ల డేటా సెంటర్లను నెలకొల్పాలన్నది ప్రభుత్వం లక్ష్యమని చెప్పిన మంత్రి, మల్టీ-గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాలు, ఎకో సిస్టమ్ అభివృద్ధిపై దృష్టి సారించామని తెలిపారు. దేశంలో ఇతర ప్రాంతాలకు లేని కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు ఏపీలో అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే డేటా సెంటర్లకు నిరంతర విద్యుత్ కోసం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని గుర్తు చేశారు.

 

భవిష్యత్తులో క్యాంపస్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఎయిర్‌ట్రంక్‌ సీఈఓను కోరారు. దేశంలో ఆ సంస్థ తన కార్యకలాపాలను విస్తరించడంతో ఆ సంస్థతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఎదురుచూస్తున్నామని తెలిపారు. మంత్రి లోకేష్ నిర్ణయంపై రాబిన్ స్పందించారు.

 

దేశంలో ఎయిర్‌ట్రంక్ ప్రణాళికలు, లుమినా క్లౌడ్‌ఇన్‌ఫ్రా ఏకీకరణ, భవిష్యత్ విస్తరణ వంటి అంశాలను చర్చించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. దీంతో విశాఖకు మరో భారీ పెట్టుబడికి మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

 

గతేడాది అక్టోబర్‌లో మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్బంగా ఎయిర్ ట్రంప్ సీఈఓ తొలిసారి రాబిన్ ఖుదాతో సమావేశమయ్యారు. ఎయిర్‌ట్రంక్ బృందం, ఏపీ ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చలు జరిపింది. భారత్‌లో కార్యకలాపాలకు ఏర్పాటు చేసిన తర్వాత విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని ఎయిర్‌ట్రంక్ పేర్కొంది.

 

ఈ నేపథ్యంలో ఎయిర్‌ట్రంక్‌ను ఏపీకి తీసుకురావాలన్న ప్రయత్నాలు కొంతకాలంగా జరుగుతున్న విషయం తెల్సిందే. ఎయిర్‌ట్రంక్ ఏప్రిల్‌లో దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. బ్లాక్‌స్టోన్ మద్దతుగా ఉన్న లుమినా క్లౌడ్‌ఇన్‌ఫ్రాను టేకోవర్ చేసింది. దీంతో ముంబై, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో సుమారు 600 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు ఆ సంస్థ దక్కించుకున్న విషయం తెల్సిందే.