APUncategorized

చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కీలక ఆధారమైన కుక్క మృతి..

కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఊహించని మలుపు తీసుకుంది. ఈ కేసులో కీలక ఆధారంగా ఉన్న పెంపుడు కుక్క.. అకస్మాత్తుగా మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిన్నారి కోసం గాలించే క్రమంలో పోలీసులు.. ఈ శునకానికి జీపీఎస్ ట్రాకర్ ను అమర్చారు. ఈ క్రమంలో 80 నిమిషాల వ్యవధిలో 8 కి.మీ మేర తిరిగిన ఈ కుక్క.. ఇంటికి తిరిగొచ్చి ఒక్కసారిగా కుప్పకూలింది.

 

అయితే శునకం శుక్రవారం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోలేదని జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పైగా అడవిలోకి పంపేందుకు అధికారులు ప్రయత్నించినా.. అది వెళ్లలేదని పేర్కొంటున్నారు. కాగా మరణానికి ముందు కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఓ బోనులో ఉన్న కుక్క.. కనీసం నిలబడలేకపోయింది. కాళ్లు వణుకుతున్న స్థితిలో కనిపించింది. ఆహారం, నీరు పెట్టినప్పటికీ అది తినలేదని స్థానికులు చెబుతున్నారు. అయితే కుక్క సహజంగా మరణించిందా? మరో కారణం ఏమైనా ఉందా? అన్న అనుమానాలు ప్రస్తుతం కలుగుతున్నాయి.

 

కేసులో ఎంతో కీలకంగా ఉన్న కుక్క.. ఇలా అర్ధంతరంగా మరణించడం ఏంటన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. ఇప్పుడు జ్ఞానేశ్వరి జాడను పోలీసులు ఏ విధంగా కనిపెడతారన్న ఉత్కంఠ స్థానికుల్లో మెుదలైంది. కుక్క లేకుండా పాపను పట్టుకోవడం పోలీసులకు అతిపెద్ద సవాలు కానుందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. కాగా గత శనివారం ఇంటివద్ద ఆడుకుంటున్న జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయింది. బాలికతో పాటు అదృశ్యమైన శునకం మంగళవారం తిరిగొచ్చింది. దాని సాయంతో పాప ఆచూకి కనుగొనాలని భావిస్తున్న పోలీసులకు కుక్క మృతితో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు.