ఖమ్మం మైనర్ బాలిక అత్యాచారయత్నం ఘటనలో నిందితుడిని ఉరి తీయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. 12 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నంతో పాటు ఆమెను బిల్డింగ్ పై నుంచి తోసేయటంతో జీవితాంతం నడవలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితురాలిని శనివారం పరామర్శించిన కవిత.. బాలిక ఆరోగ్య పరిస్థితి.. ఆమెకు అందిస్తున్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి తల్లిదండ్రులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు.
‘నిందితుడ్ని ఉరి తీయాలి’
అనంతరం మాట్లాడుతూ.. అత్యంత అమానుషమైన దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని ఉరి తీయాలని కవిత డిమాండ్ చేశారు. నిందితునిపై కఠినమైన చట్టాలు ప్రయోగించి వీలైనంత తొందరగా శిక్షపడేలా మంచి లాయర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. శిక్ష ఎంత లేటు అయితే నిందితుల్లో అంత భయం లేని పరిస్థితి వస్తుందన్నారు. ఈ సంఘటనలో ప్రభుత్వ పెద్దలే కేసు వాపసు తీసుకోవాలంటూ బాధితురాలి కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నారని.. ఇది చాలా అమానుషమని కవిత అన్నారు. ఈ కేసు విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా బాధితురాలికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
‘ప్రతీ నెల రూ.50 వేలు ఇవ్వాలి’
అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకున్న 12 ఏళ్ల బాలిక ఒక్కసారి బిల్డింగ్ మీద నుంచి పడి జీవితాంతం నడవలేని పరిస్థితికి చేరటం ఆ తల్లితండ్రులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోందని కవిత అన్నారు. బాధితురాలి తల్లి నిందితున్ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తోందని చెప్పారు. అదే విధంగా బాధితురాలు జీవితాంతం మంచానికే పరిమితమయ్యే పరిస్థితి వచ్చిందని.. ఆమెను పసిబిడ్డలా చూసుకోవాల్సి ఉంటుందని అన్నారు. తల్లితండ్రులు ఇద్దరు కూడా కూలీలేనని వారికి అంత ఆర్థిక స్థోమత లేదని కవిత చెప్పారు. ప్రభుత్వమే ఆ కుటుంబానికి అండగా ఉండాలన్నారు. వారికి ఇళ్లు కేటాయించటంతో పాటు ప్రతి నెల రూ. 50 వేలు పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించాలని సూచించారు.
సీఎంపై తీవ్ర ఆగ్రహం
రాష్ట్రంలో మహిళలకు, ఆడపిల్లలకు భద్రత లేని పరిస్థితి వచ్చిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్లపై రోజుకు 5 అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు. అయిన సరే ఈ ప్రభుత్వం లో చలనం లేదన్నారు. హోమంత్రిగానూ ఉన్న ముఖ్యమంత్రి ఇకనైనా స్పందించాలని డిమాండ్ చేశారు. రివ్యూ చేపట్టి మహిళలు, ఆడపిల్లల భద్రతపై భరోసా ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.

