భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 17న ప్రారంభించనున్నారు. హర్యానాలోని 89 కిలోమీటర్ల జింద్-సోనిపట్ మార్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. పర్యావరణ హిత రవాణా దిశగా భారత రైల్వే వేసిన ఈ అడుగు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ హైడ్రోజన్ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) అభివృద్ధి చేసింది. డీజిల్ ఇంజిన్‌తో నడిచే డెమూ రైలును ఆధునికీకరించి, ఇందులో 1,200 కిలోవాట్ల సామర్థ్యం గల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్‌ను అమర్చారు. ఈ సాంకేతికతలో హైడ్రోజన్, ఆక్సిజన్ కలయికతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కేవలం నీటి ఆవిరి మాత్రమే వ్యర్థంగా వెలువడటం వల్ల పర్యావరణ కాలుష్యానికి తావు ఉండదు. పది కోచ్‌లు కలిగిన ఈ రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇందులో సుమారు 2,600 మంది ప్రయాణించే వీలుంది.
టికెట్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేలా రూ. 5 నుంచి రూ. 25 మధ్య నిర్ణయించారు. జింద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా ఇంధనాన్ని సరఫరా చేస్తారు. ఇప్పటికే అన్ని రకాల భద్రతా పరీక్షలను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి కొంత దూరం ప్రయాణించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, దేశవ్యాప్తంగా మరో 35 హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ యోచిస్తోంది.

