Uncategorized

‘బుల్లెట్ రైల్’ హబ్‌గా హైదరాబాద్..! రాంచందర్ రావు కీలక ప్రకటన..

భారతీయ రైల్వే రంగంలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని, రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరం ఒక బుల్లెట్ రైల్ హబ్‌గా మారబోతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా హైదరాబాద్‌లో రూ.35.61 కోట్ల భారీ వ్యయంతో సర్వాంగ సుందరంగా ఆధునీకరించిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

 

అంతర్జాతీయ ప్రమాణాలతో హైటెక్ సిటీ స్టేషన్

అధునిక హంగులతో, ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా తీర్చిదిద్దిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితో పాటు స్థానిక రైల్వే అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 41 రైల్వే స్టేషన్లను ఎలివేటర్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు వంటి అత్యాధునిక వసతులతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఆధునీకరిస్తోందని ఆయన వివరించారు.

 

రూ.4,900 కోట్లకు పెరిగిన రైల్వే బడ్జెట్

గత ప్రభుత్వాల పాలనకు, ప్రస్తుత మోడీ ప్రభుత్వ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని రాంచందర్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైల్వే బడ్జెట్ కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఉండేదని చెప్పారు. కానీ, ప్రధాని మోడీ నేతృత్వంలో గత పన్నెండేళ్లుగా రైల్వే రంగానికి ప్రాధాన్యత పెరిగిందన్నారు. ప్రస్తుతం కేవలం తెలంగాణ రైల్వే రంగానికే బడ్జెట్‌ను రూ.4,900 కోట్లకు పెంచినట్లు వెల్లడించారు.

 

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ భారీ నిధులతో రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతులు వేగంగా విస్తరిస్తున్నాయని, భవిష్యత్తులో హైదరాబాద్ రవాణా రంగంలో మరింత కీలక మైలురాళ్లను అందుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, రైల్వే ఉన్నతాధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.