AP

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్..!

ఉత్తరాంధ్ర స్వరూపాన్నే మార్చేసే అత్యంత ప్రతిష్టాత్మకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.

 

ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం

 

ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’గా నామకరణం చేశారు. వచ్చే ఆగస్టు 1వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ఎయిర్‌పోర్ట్‌ను వైభవంగా ప్రారంభించనున్నారు. కేవలం ప్యాసింజర్ టెర్మినల్ మాత్రమే కాకుండా, ఏవియేషన్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్ , ఎడ్యుసిటీలను కూడా ఇదే రోజున ప్రజలకు అంకితం చేయనున్నారు.

 

ఉత్తరాంధ్రకు మణిహారం.. లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ

 

ఈ ప్రాజెక్ట్ విశాఖ ఎకనామిక్ రీజియన్‌కు ఊపిరిపోస్తూ, రాష్ట్రానికి గ్లోబల్ కనెక్టివిటీని అందిస్తుంది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఏర్పాటుకానున్న ఏఐ డేటా సెంటర్లు, రేర్ ఎర్త్ మినరల్స్ ఆధారిత పరిశ్రమలకు ఈ ఎయిర్‌పోర్ట్ ఓ గేమ్ చేంజర్‌గా మారనుంది. పరిశ్రమలు, టూరిజం, లాజిస్టిక్స్ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులతో పాటు స్థానిక యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

 

రైతులకు చంద్రబాబు నజరానా..

 

విమానాశ్రయం కోసం తమ అమూల్యమైన భూములను త్యాగం చేసిన భూ యజమానులకు సీఎమ్‌ చంద్రబాబు గౌరవపూర్వకమైన ఆఫర్ ప్రకటించారు. భూములిచ్చిన రైతులకు ‘ఒకసారి ఉచిత విమాన ప్రయాణ అవకాశం’ కల్పిస్తున్నట్లు తెలిపారు.

 

వచ్చే 9 రోజుల పాటు ఉత్తరాంధ్రలోని ప్రతి ఇంట్లో ఈ ఉత్సవ స్ఫూర్తి నిండాలని సీఎం పిలుపునిచ్చారు. అరకు కాఫీ సువాసనలు, ప్రాంతీయ సంస్కృతీ సంప్రదాయాలు, స్థానిక కళారూపాల ప్రదర్శనలతో ప్రారంభోత్సవాన్ని ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిర్వహించాలని ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు.