మంగళగిరి ప్రజాసేవలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా ఇళ్ల పట్టాల కోసం నిరీక్షిస్తున్న పేదల నిరీక్షణకు తెరదించుతూ, రాష్ట్ర విద్యుత్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ చారిత్రాత్మక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు. ‘మన ఇల్లు – మన లోకేశ్’ పేరుతో మంగళగిరిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఏకంగా 3,000 మంది నిరుపేద కుటుంబాలకు శాశ్వత భూహక్కు పత్రాలను స్వయంగా అందజేశారు. అయితే, బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 1,000 కోట్ల విలువైన ఈ ఆస్తులను పేదలకు అందిస్తూ, వారి జీవితాలకు శాశ్వత భరోసా కల్పించారు. లోకేశ్ తీసుకున్న ఈ ముందడుగుతో వేలాది కుటుంబాల దశాబ్దాల కల నెరవేరింది.
భయాలు, అపోహలను పటాపంచలు చేస్తూ..
గత కొంతకాలంగా స్థానిక ప్రజలలో భూహక్కులపై కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అపోహలు, భయాలు సృష్టిస్తున్నారని, అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని లోకేశ్ తెలిపారు. అంతేకాకుండా దశాబ్దాలుగా ఈ భూముల్లో నివసిస్తున్నప్పటికీ చట్టబద్ధమైన హక్కులు లేక పేదలు అనుభవించిన వేదన నాకు తెలుసు. ఈ శాశ్వత భూపట్టాతో మీ ఆస్తిని ఇకపై ఎవరూ కదిలించలేరు అని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో మంగళగిరి పరిధిలోని మూడు వేల కుటుంబాలకు తమ సొంతింటి భూమిపై పూర్తి బాధ్యత, హక్కు లభించాయి.
ఆర్థిక సవాళ్లున్నా ఆగని సంక్షేమం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కూడా మంత్రి ఈ సందర్భంగా కీలక విషయాలు పంచుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిని ఉందని, రూపాయి ఆదాయం ఉంటే రూ. 1.60 పైసల ఖర్చు ఉండేదని గుర్తుచేశారు. గడిచిన కాలంలో సమర్థవంతమైన పాలన, అభివృద్ధి చర్యల ద్వారా ఆ ఖర్చును రూ. 1.40కి తగ్గించగలిగామని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ, అభివృద్ధి-సంక్షేమాలను ‘జోడెద్దుల్లా’ ముందుకు నడిపిస్తున్నామని, పేదల సంక్షేమం విషయంలో ఎక్కడా తగ్గబోమని ధీమా వ్యక్తం చేశారు.
అవమానాల నుంచి ఆశయ సాధన వైపు!
2019 ఎన్నికల ఓటమిని, ఆ తర్వాత ఎదుర్కొన్న తీవ్రమైన అవమానాలను లోకేశ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. “సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయావు.. కొడుకుని కూడా గెలిపించుకోలేకపోయావ్” అని తనతో పాటు నారా చంద్రబాబు నాయుడిని కూడా తీవ్రంగా అవహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ అవమానాలనే కసిగా మార్చుకుని, మంగళగిరి ప్రజల మధ్యే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నానని తెలిపారు. ఆ కసి, నిరంతర శ్రమే 2024 ఎన్నికల్లో తనకు ఏకంగా 91,000 ఓట్ల చారిత్రాత్మక మెజారిటీని అందించిందని భావోద్వేగంగా పేర్కొన్నారు.
దేశానికే మోడల్‌గా మంగళగిరి వికాసం
తనను కొండంత బలంతో గెలిపించిన మంగళగిరి ప్రజల రుణం తీర్చుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నారా లోకేశ్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్ది చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాలు, పేదల సంక్షేమమే ధ్యేయంగా మంగళగిరిని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తానని పునరుద్ఘాటించారు. లోకేశ్ తీసుకున్న ఈ చొరవపై స్థానిక ప్రజలు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

